Hydra : హైడ్రాను ఐపీఎస్ కు అప్పగించింది అందుకేనట.. రేవంత్ ఆలోచన డిఫరెంట్‌గానే?

హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు ఆగడం లేదు. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు

Update: 2024-09-05 12:04 GMT

హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు ఆగడం లేదు. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే హైడ్రా కమిషనర్ గా ఐపీఎస్ అధికారిని నియమించడంపై ఐఏఎస్ వర్గాల్లో ఒకింత చర్చ జరుగుతుంది. రెవెన్యూకు స్థలాలకు సంబంధించిన వ్యవహారానికి ఐపీఎస్ తో ఏం పని కొందరు ఐపీఎస్ లు ఆఫ్ ది రికార్డుగా ప్రశ్నిస్తున్నారు. సీనియర్ అధికారులను పక్కనపెట్టి మరీ ఐపీఎస్ లను నియమించడమేంటన్న ప్రశ్న ఐఏఎస్ అధికారుల్లో తలెత్తుతుంది. ఇప్పుడు హైడ్రా అంటే ఒకింత భయంతో పాటు మంచి పేరు రావడంతో ఐఏఎస్‌లలో ఈ చర్చ సహజంగానే మొదలయిందట.

రెవెన్యూ విషయాలైనా...?
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం.. ఆలోచన వేరే విధంగా ఉంది. రెవెన్యూకు సంబంధించిన వ్యవహారాలైనప్పటికీ, స్థలాలకు సంబంధించిన అంశాలైనప్పటికీ, చెరువులు, కుంటలు, నాలాలకు సంబంధించిన విషయాలయినప్పటికీ ఐఏఎస్ అధికారులయితే అంత దూకుడుగా వ్యవహరంచలేరన్న ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారట. వారు ఎక్కువ ఒత్తిళ్లకు లోనుకాలేరు. దీంతో పాటు నిబంధనలు అంటూ నానుస్తూనే ఉంటారు. మరొకవైపు హైడ్రా బాధ్యతలను వాస్తవానికి ఐఏఎస్ అధికారికి అప్పగించాలని తొలుత రేవంత్ రెడ్డి భావించినా తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారని తెలిసింది.
ఆలోచనకు తగినట్లుగానే...
ఐఏఎస్ కంటే ఐపీఎస్ బెటర్ అన్న ఆలోచన ఆయనకు రావడంతోనే రంగనాధ్ ను నియమించారని చెబుతున్నారు. దీనికి తోడు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను సమన్వయం చేసుకుంటూ రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను గుర్తించి వెంటనే కూల్చివేతలను ప్రారంభించాలంటే ఐపీఎస్ అధికారి అయితే స్పీడ్ గా చేస్తారని ముఖ్యమంత్రి భావించినట్లు చెబుతున్నారు. ఆయన ఆలోచనలకు తగినట్లుగానే ఐపీఎస్ రంగనాధ్ ను నియమించడంతో హైడ్రా అంటేనే నగరంలో ఆక్రమణదారులకు వణుకుపుడుతుంది. ఆయన అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటి వరకూ అనేక కట్టడాలను కూల్చివేయించారు. అందుకే ఐపీఎస్ ను నియమించినట్లు ఇటీవల తన సన్నిహిత మంత్రుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.


Tags:    

Similar News