Temperatures :: బయటకు వచ్చారో ఇక అంతే.. మాడి మసయిపోతారు.. 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకూ నమోదు అవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడిపోతున్నారు. ఇళ్లలో ఉన్న నిప్పుల కుంపట్లో కూర్చున్నట్లే ఉంది. ఉదయం ఆరు గంటల నుంచే ఉక్కపోత మొదలవుతుంది. ఇళ్లలో 24 గంటలూ ఏసీలు వాడుతున్నారంటే ఏ స్థాయిలో ఎండల తీవ్రత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మే నెల ఆరంభంలోనే ఇలా ఉంటే ఇక రోహిణీ కార్తె వస్తే రోళ్లు పగలడం సంగతి అటుంచితే.. ఇళ్లలో జనం బతుకుతారా? అన్న రీతిలో భయపడిపోతున్నారు జనం. ఎందుకంటే అంత తీవ్రత గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు.
ఉదయం నుంచే...
ఉదయం ఏడు గంటల నుంచి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. భానుడి భగభగలతో రహదారులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అవసరముంటే తప్ప బయటకు రావడం లేదు. ఏదైనా అత్యవసర పని ఉంటే మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుని వస్తున్నారు. దీనికి తోడు వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఎంతగా అంటే చెవుల్లోకి వడగాలులు వెళ్లాయంటే వడదెబ్బ తగలడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. అందుకే వీలయినంత వరకూ ఇంటిపట్టునే ఉండేలా చూసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అంతే తప్ప బయటకు వస్తే మాత్రం మాడి మసయిపోవడం ఖాయమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో...
తెలంగాణలో ఇప్పటికే పదిహేను జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మరో పద్దెనిమిది జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఒక్కనిమిషం పాటు బయటకు వెళ్లినా హీటెక్కిపోతుంది. నోరు తడి ఆరిపోతుంది. చెమటలు పట్టేస్తున్నాయి. ఇలాంటి వాతావరణం గతంలో ఎన్నడూ చూడలేదని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఉదయం వేళ బయటకు రావడం మానేశారు. రాత్రి ఆరు గంటల తర్వాతనే బయటకు వచ్చి తమకు కావాల్సిన నిత్యావసరాలు కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. మరికొద్ది రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చేస్తున్న హెచ్చరికలతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే.