Breaking : కవిత కస్టడీ పొడిగింపు...లోతుగా విచారించాలని ఈడీ అభ్యర్థన

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హాజరుపర్చారు.

Update: 2024-03-23 07:39 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హాజరుపర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మూడు రోజుల పాటు ఆమెను కస్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది.  ఈనెల ఇరవై ఆరోతేదీన ఆమెను కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. గతంలో వారం రోజుల పాటు ఆమెను విచారించిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి కోర్టుకు హాజరుపర్చాలని న్యాయస్థానం ఆదేశించడంతో కొద్దిసేపటి క్రితం కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకు వచ్చారు. కవితను కోర్టుకు తీసుకు వస్తారని తెలిసి ఆమె కుటుంబ సభ్యులు ముందుగానే కోర్టు వద్దకు చేరుకున్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం మరో ఐదురోజులు కస్టడీకి అనుమతించాలని కోరారు. విచారించాల్సిన కీలక అంశాలున్నాయని, సమయం సరిపోనందున గడువు పొడిగించాలని కోరారు. కవిత మొబైల్ డేటాను కూడా విశ్లేషించాల్సిన అవసరముందని ఈడీ అధికారులు తెలిపారు.

కవితది కీలక పాత్ర అని...
కల్వకుంట్ల కవితను మరో ఐదు రోజల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరుపున న్యాయవాదులు కోరారు. మరికొన్ని అంశాలను విచారించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించాలని కోరింది. కవితను ఈ నెల 16వ తేదీన బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరిపి అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని వారు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సౌత్ ఇండియా లిక్కర్ వ్యాపారుల నుంచి కవిత ముడుపులు సేకరించి ఆప్ నేతలకు ఇచ్చారన్న ఆరోపణలను ఈడీ అధికారులు చేస్తున్నారు. కవిత తన సెల్‌ఫోన్లను కూడా ధ్వంసం చేసి ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారంటూ ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్ లో కోట్లు చేతులు మారాయన్నారు. కవిత విచారణకు సహకరించడం లేదని పేర్కొన్నారు.
బెయిల్ పిటీషన్ పై...
మరోవైపు బెయిల్ పిటీషన్ ను తాము న్యాయస్థానంలో వేశామని, దానిపై విచారణ జరపాలని కవిత తరుపున న్యాయవాదులు కోరారు. కవిత అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని వారు వాదించారు. కవిత ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేదని, హైబీపీతో ఆమె బాధపడుతున్నారని కవిత తరుపున న్యాయవాదులు తెలిపారు. కవిత బెయిల్ పిటీషన్ పై ఈడీకి నోటీసులు ఇవ్వాలన్నారు. కవిత పిల్లలు మైనర్లని, వారిని కలిసేందుకు అనుమతివ్వాలని కూడా కోరారు. కస్టడీ పూర్తయిన రోజునే బెయిల్ పిటీషన్ పై విచారణ జరపాలని వారు కోరారు. అయితే తను ఈడీ అధికారులు అడిగిందే అడిగి వేధిస్తున్నారని, తాను న్యాయస్థానంలో తేల్చుకుంటానని ఆమె కోర్టు వద్ద మీడియాకు తెలిపారు. తనది అక్రమ అరెస్ట్ అన్న కవిత ఐటీ వివరాలను కూడా అడుగుతున్నారన్నారు. ఈడీ కస్టడీలో ఉంటే ఐటీ పత్రాలు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. న్యాయమూర్తి మూడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News