మొన్న తిరుపతి, నేడు మంచిర్యాల.. డెడ్ బాడీని తరలించడానికి రూ.80వేలు డిమాండ్ !

ఉత్తరప్రదేశ్ కు చెందిన అన్నదమ్ములు మంచిర్యాలలో కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల ఎండలో పనిచేస్తుండగా..

Update: 2022-05-01 07:24 GMT

మంచిర్యాల : ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో రుయా ఆస్పత్రి వద్ద అంబులెన్స్ మాఫియా చేసిన నిర్వాకానికి ఓ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని బైక్ పై తీసుకువెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో జరిగింది. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా.. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.80,000 డిమాండ్ చేయడంతో మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలివెళ్లిన హృదయ విదారక ఘటన తాజాగా వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన అన్నదమ్ములు మంచిర్యాలలో కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల ఎండలో పనిచేస్తుండగా.. ఒకరికి వడదెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు అతని సోదరుడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందడంతో.. మృతదేహాన్ని యూపీలోని తమ గ్రామానికి తీసుకెళ్లాలని మృతుని సోదరుడు కోరాడు. అందుకు రూ.80 వేలు చెల్లించాలని అంబులెన్స్ డ్రైవర్లు చెప్పడంతో.. చేసేది లేక సోదరుడి మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలి వెళ్లాడు. మృతుడిని మోతీషా గా గుర్తించారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. మృతదేహాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించే సౌకర్యం ఆస్పత్రిలో లేదని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


Tags:    

Similar News