Rain Alert : తెలంగాణలో మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలే

మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది

Update: 2024-09-05 02:26 GMT

తెలంగాణకు వర్షాలు వీడేటట్లు కనిపించడం లేదు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

రుతుపవనాలు...
తెలంగాణపై రుతుపవనాలు బలంగా వీస్తున్నందున భఆరీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. గురువారం అంటే ఈరోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పింది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు నిండిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు...
లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని కోరింది. హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్యాలయంలోనూ ప్రత్యేక సెల్ ను ఏర్పాటుచేశారు. హైదరాబాద్ నగర ప్రజలు కూడా అలెర్ట్ గా ఉండాలని చెప్పారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే ఉద్యోగులకు ప్రభుత్వం సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరో వైపు శనివారం వినాయక చవితి పండగ ఉండటంతో భారీ వర్షాలు పండగపై ప్రభావం చూపుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News