Nagarjuna Sagar: సాగర్‌ డ్యామ్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం.. భారీగా పోలీసులు

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్యామ్‌కు ఇరవువైపులా ఇటు తెలంగాణ..

Update: 2023-12-01 05:24 GMT

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్యామ్‌కు ఇరవువైపులా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. సాగర్‌కు ఉన్న మొత్తం 26 గేట్లలో 13వ నంబర్ గేట్ వద్ద ఏపీ పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం 13వ గేటు వరకూ తమ పరిధిలో ఉంటుందని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాము 13వ గేటు వద్ద కంచెను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఏపీ పోలీసులు వేసిన కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించగా, అందుకు ఆంధ్రా పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది.

నీటిని అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్ కంట్రోల్ రూంను ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులు తమ స్వాధీనంలోకి తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. డ్యామ్‌పై సుమారు 1500 మందికిపైగా పోలీసులు మోహరించారు. నిన్న తెలంగాణలో ఎన్నిక పోలింగ్‌ ఉన్నందున అక్కడికి వెళ్లిని తెలంగాణ పోలీసులు శుక్రవారం డ్యామ్‌ వద్దకు చేరుకోవడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

వందల మంది ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ వద్దకు చేరుకొని 13 గేట్లను స్వాధీనం చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒంగోలు చీఫ్‌ ఇంజినీర్‌ ఆధ్వర్యంలో సాగర్‌ కుడి కాలువ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ తెలంగాణ పోలీసులు వాదిస్తుండగా, విభజన హక్కుల ప్రకారమే 13వ గేట్‌ తమ పరిధిలోకి వస్తుంటోంది ఏపీ పోలీసులు చెబుతున్నారు.

ఏపీ సర్కార్‌ది దుందుడుకు చర్య - కిషన్‌రెడ్డి

ఈ ఘటనపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి స్పందించారు. ఏపీ సర్కార్‌ది దుందుడుకు చర్య అని అన్నారు. సాగర్‌ దగ్గర జరిగిన ఈ ఘటన ముమ్మాటికీ శాంతిభద్రతల సమస్య అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు కిషన్‌ రెడ్డి. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందని, ఇలాంటి ఘటనలు కావాలనే సృష్టిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

రాజకీయ లబ్ధికోసమే సాగర్‌ ఘటన- రేవంత్‌ రెడ్డి

పోలింగ్‌కు కొన్ని గంటల ముందు నాగార్జున సాగర్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు ఘర్షణ పడడం అనుమానాస్పదంగా ఉందని, ఈ సమస్యను ఎవరు లేవనెత్తారో తెలంగాణ ప్రజలకు తెలుసునని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు . ప్రజలు తెలివైన వారని, మతోన్మాద ఉద్దేశ్యంతో లేవనెత్తిన ఇలాంటి సమస్యలకు ఎలా సమాధానం చెప్పాలో వారికి తెలుసు అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Tags:    

Similar News