నుమాయిష్ మూసివేత.. దిక్కుతోచని స్థితిలో వేలమంది !
న్యూ ఇయర్ రోజున గ్రాండ్ గా ప్రారంభమైన హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (నుమాయిష్) ఒక్కరోజు కూడా కాకుండానే మూతపడింది.
న్యూ ఇయర్ రోజున గ్రాండ్ గా ప్రారంభమైన హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (నుమాయిష్) ఒక్కరోజు కూడా కాకుండానే మూతపడింది. జనవరి 1వ తేదీన హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుమాయిష్ ను ప్రారంభించారు. ఏటా హైదరాబాద్ లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇదే. ఎన్నో వేల మంది ఈ ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ను ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తుంటారు. అలాంటి నుమాయిష్ ప్రారంభమై ఒక్కరోజైనా కాకుండానే.. మూతపడింది. గత రాత్రి అకస్మాత్తుగా నుమాయిష్ ను మూసివేశారు. అప్పటికప్పుడు ఎగ్జిబిషన్ లో ఉన్న వేలమందిని బయటికి పంపేశారు. దీంతో 10 వేలమంది దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
పోలీసుల ఆదేశాలతో తొలుత టికెట్ బుకింగ్ కౌంటర్లను మూసివేశారు. ఆ తర్వాత స్టాల్స్ ను మూసివేసి, సందర్శకులంతా వెళ్లిపోవాల్సిందిగా మైకుల ద్వారా ప్రకటించారు. దీంతో నుమాయిష్ ను తిలకించేందుకు ఎంతో ఆనందంగా వచ్చిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. కోవిడ్, ఒమిక్రాన్ ల వ్యాప్తి నేపథ్యంలో జనవరి 10వ తేదీ వరకూ రాష్ట్రంలో సామూహిక సమావేశాలు, సాంస్కృతి కార్యక్రమాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకే నుమాయిష్ ను కూడా మూసివేయాలని సొసైటీ నిర్ణయించింది. జనవరి 10 తర్వాత పరిస్థితులను బట్టి నుమాయిష్ ను కొనసాగించాలా ? వద్దా ? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అశ్విన్ మార్గం తెలిపారు.