రాజా సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంఐఎం నేతపై పీడీయాక్ట్
ఆగస్ట్ 22, 23 తేదీల్లో రాత్రి సమయంలో బషీర్‌బాగ్ సమీపంలోని పోలీస్ కమీషనర్ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు..
రాజాసింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కషఫ్ పై హైదరాబాద్ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య విబేధాలు సృష్టించి శతృత్వాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కషఫ్ అని పిలువబడే ఎంఐఎం నాయకుడు సయ్యద్ అబ్దాహు క్వాద్రీపై హైదరాబాద్ పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ)చట్టాన్ని ప్రయోగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. రాజా సింగ్‌పై దూకుడుగా 'సర్ తన్ సే జుదా' తల తెగి పడుతుంది అంటూ నినాదాలు చేసి వివాదానికి కారణమైన కషఫ్ ను గురువారం అరెస్ట్ చేశారు.
ఆగస్ట్ 22, 23 తేదీల్లో రాత్రి సమయంలో బషీర్‌బాగ్ సమీపంలోని పోలీస్ కమీషనర్ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు గుమిగూడి, ఒక వీడియోలో ముహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కషఫ్ రాజాసింగ్ పై చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంస, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మొఘల్‌పురా, షాహినాయత్‌గంజ్, భవానీ నగర్, హుస్సేనీ ఆలం ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లపై ఆందోళనకారులు దాడి చేశారు. ఇక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, మత విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేసిన ఎంఐఎం నేత కషఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు ఉస్మానియాలో అతనికి వైద్యపరీక్షలు నిర్వహించి చంచల్ గూడ జైలుకు తరలించారు.