ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన తెలంగాణకు రానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన తెలంగాణకు రానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. విశాఖ నుంచి బయలుదేరి నేరుగా హైదరాబాద్ కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో రామగుండంకు ప్రధాని బయలు దేరి వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే రెండు సార్లు ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్న కేసీఆర్ ఈసారి ఏం చేస్తారన్నది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ వేరే కార్యక్రమానికి...
ప్రధాని పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ప్రధాని పర్యటనలో పాల్గొనాలంటూ కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రిత్వ శాఖ నుంచి కేసీఆర్ కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. మోదీ పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కేసీఆర్ పాల్గొనే అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఇటీవల కాలంలో మోదీపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ప్రధాని పర్యటనకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.