తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే కాకుండా మయన్మార్ నుంచి మేఘాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే కాకుండా మయన్మార్ నుంచి మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు కదులుతుండడంతో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈశాన్యానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 4.5 నుండి 7.6 కి.మీల మధ్య ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని చెప్పారు. దీని ప్రభావంతో నేటి నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆగస్టు నెలలో వర్షాలు తక్కువ పడిన సంగతి తెలిసిందే..! ఇక వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో రైతులలో ఆనందం కనిపించనుంది.