రంగం భవిష్యవాణి.. వర్షాలు, అగ్నిప్రమాదాలపై ఏం చెప్పారంటే
బోనాల వేడుకల్లో భాగంగా నేడు రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైన బోనాల వేడుకలు.. రెండోరోజూ కొనసాగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా నేడు రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ భవిష్యవాణిలో ప్రధానంగా వర్షాలు, అగ్నిప్రమాదాలపై చెప్పారు. ప్రజల నుంచి పూజలను సంతోషంగా అందుకున్నానని, గతేడాది తనకు ఇచ్చిన వాగ్ధానాన్ని మరచిపోయారన్నారు. కావలసిన బలాన్నిచ్చానని, మీ వెంటే ఉంటానని తెలిపారు.
కాస్త ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయన్నారు. అలాగే తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు చూసి ఎవరూ భయపడొద్దన్నారు. తనవద్దకు వచ్చే ప్రజలను కాపాడుకునే భారం తనదేనని, ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే బాధ్యత తనదేనన్నారు. ఐదు వారాలపాటు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొనగా.. భవిష్యవాణి వినేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.