ఆ భయంతోనే కేసీఆర్ ఇవ‌న్నీ చేస్తున్నారు : రేవంత్ రెడ్డి

గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Update: 2023-08-15 05:19 GMT

గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 140 కోట్ల భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారన్నారు. ఈరోజు ప్రధానంగా ముగ్గురిని మనం స్మరించుకోవాలి.. అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీని.. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించిన‌ అంబేద్కర్ ను, కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశాన్ని సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ ను స్మరించుకుని నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన నేత అని కొనియాడారు. పీవీ, మన్మోహన్ దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించారన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ అవలంబిస్తోందని విమ‌ర్శించారు. విద్వేషాన్ని వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారన్నారు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు చేసిన 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే.. ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారని ఆరోపించారు.

దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు.. కానీ పెరిగింది.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు. ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయని అన్నారు.

కాంగ్రెస్ హామీలు ఇస్తుంటే.. సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నాడని.. ఓటమి భయంతోనే రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నాడని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతున్నదంటే అది కాంగ్రెస్ వల్లేన‌ని పేర్కొన్నారు. కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై మేం వచ్చాక సమీక్షిస్తామ‌న్నారు. కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడింది.. 10వేల ఎకరాలు దోచుకుందని ఆరోపించారు.

కాంగ్రెస్ వస్తుంది.. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామ‌న్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామ‌న్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదామ‌ని శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. ప్రతీ గడపకు వెళ్లి.. ప్రతీ తలుపు తడదామ‌ని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామ‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కులకు సూచించారు.


Tags:    

Similar News