Telangana : ఈనెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం.. వారందరికీ శుభవార్త
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబరు మొదటి వారం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబరు మొదటి వారం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిసెంబరు రెండో వారంలోనే లబ్దిదారులకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను పేద వర్గాలకు నిర్మించేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయి ఏడాది గడుస్తుండటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నియోజకవర్గాల వారీగా లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.
యాప్ అందుబాటులోకి...
ఇందుకోసం ఈ నెల 5వ తేదీన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ ను అందుబాటులోకి ప్రభుత్వం తేనుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు తొలి విడతగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తారు. తొలి విడతగా సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారు ఇంటిని నిర్మించుకునేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. ఇంటినిర్మాణం కోసం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల వరకూ ఆర్థికసాయాన్ని అందచేయనున్నారు. ఇంటి నిర్మాణంలో అవసరమైతే లబ్దిదారులు తమ సొంత ఖర్చును భరించి ఎక్కువ గదులను, పై అంతస్థును కూడా నిర్మించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇందుకు అవసరమైన అనుమతులు సులువుగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
తొలి విడతగా...
తెలంగాణ వ్యాప్తంగా మొదట విడత నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించనుంది. ఇందుకోసం మూడు వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి ఏడాది వరసగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని తెలిపింది. ప్రతి ఏటా కొన్ని చొప్పున దశలవారీగా ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇప్పటికే గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల నిర్ణయం మేరకు లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుండటంతో మంచి ఇల్లు నిర్మించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. తొలుత సొంత స్థలం ఉన్నవారికి, తర్వాత ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.