తెలంగాణలో హస్తం దూకుడు.. కారు, కమలంపై ప్రజా ఛార్జ్‌షీట్‌

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయా పార్టీలు దూకుడు పెంచాయి. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు..

Update: 2023-09-15 06:05 GMT

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయా పార్టీలు దూకుడు పెంచాయి. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ విషయానికొస్తే ఈ నెల 17న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయతే సీడబ్యూసీ భేటీతో పాటు విజయభేరి సభతో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తోంది.

మరోవైపు బీజేపీ-బీఆర్ఎస్ వైఫల్యాలు ప్రజల్లో చర్చకు వచ్చేలా చూస్తోంది. ఇందుకోసం ప్రణాళిక సిద్దం చేసిన కాంగ్రెస్‌.. ఆ రెండు పార్టీలపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అధికార బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సమయం దగ్గర పడుతోంది మిత్రమా.. అంటూ కాంగ్రెస్‌ నేతలను, కార్యకర్తలను అప్రమత్తం చేస్తోంది. పనులు వేగవంతం చేస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇచ్చిన హామీలు ఏవేవో నెరవేరలేదో ఆ అంశాలన్ని గడపగడపకు తీసుకెళ్లనున్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఈ రెండు పార్టీలు ఏం హామీలిచ్చాయి..? ఎన్ని నెరవేర్చారు..? అవన్నీ పాయింట్‌ టు పాయింట్ ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది హస్తం పార్టీ.

గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. బీఆర్‌ఎస్‌, బీజేపీ తోడుదొంగలంటూ కరపత్రాలు సైతం ప్రింట్‌ చేయించి గడగడపకు పంచుతున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోతో పాటు ఛార్జ్‌షీట్‌ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ తెలిపారు. మరోవైపు తుక్కుగూడ వేదికగా ఈనెల 17 నిర్వహించే విజయభేరి సభకు కాంగ్రెస్‌ ఏర్పాటు ముమ్మరం చేస్తోంది. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ విజయవంతం చేసేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తోంది. ఈ సభా వేదిక నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఈ సభకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె కీలకమైన హామీలను ప్రకటించే అవకాశం ఉంది.


Tags:    

Similar News