బహిష్కరించిన బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు

గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో ప్రమాణం చేయించారు. అల్లా సాక్షిగా అక్బరుద్దీన్

Update: 2023-12-09 06:07 GMT

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కీలక భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ప్రమాణ స్వీకారం చేయబోమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం, ఒవైసీ ప్రమాణం కూడా చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది శనివారం ఉదయం కిషన్ రెడ్డిని కలిశారు. అందరూ కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ఆఫీసులో వారంతా సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, ప్రమాణ స్వీకారం, ప్రొటెం స్పీకర్ గా ఒవైసీ ఎంపిక అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడంపైనా చర్చించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూ ఉంది.

తెలంగాణ మూడో శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌భవన్‌‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో ప్రమాణం చేయించారు. అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ తన బాధ్యతలు నిర్వహిస్తానంటూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆర్టికల్ 178 ప్రకారం శాసనసభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకూ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ సేవలందిస్తారంటూ గవర్నర్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీలో అందరికంటే సీనియర్ సభ్యుడు కావడంతో అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు దక్కాయి.


Tags:    

Similar News