ఆరోగ్య తెలంగాణయే ధ్యేయం : కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిన ఘట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిన ఘట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన తొమ్మిది మెడికల్ కళాశాలలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు పూర్తవుతున్నాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 24 మెడికల్ కళాశాలలు పూర్తయి ప్రారంభించుకున్నామని, ఈరోజు 8,515 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు వస్తుందన్నారు. ఇందులో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని ఈ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. ఏడాదికి పదివేల మంది వైద్యులు బయటకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అన్ని రంగాల్లో...
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యవసాయ రంగంలోనూ ప్రముఖ స్థానంలో ఉన్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఐదు మెడికల్ కళాశాలలు రావడం అభివృద్ధికి నిదర్శనం కాదా? అని ఆయన ప్రశ్నించారు. మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాలోనూ మెడికల్ కళాశాల రావడం అంటే మాటలు కాదని తెలిపారు. 34 వైద్య కళాశాలలు అంటే ఆ సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్న పడకలతో ఆసుపత్రులు నిర్మించుకోవడమేనని తెలిపారు. పరిపాలన చేత కాదని వెక్కిరించిన వారికి మనమేంటో చూపించగలిగామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలతో
వరంగల్ లో సూపర్ స్పెషాలిటీతో పాటు హైదరాబాద్ నగరంలో టిమ్స్ కింద నాలుగు గచ్చిబౌలి, ఆల్వాల్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రులలో పడకల సంఖ్య యాభై వేలకు చేరుకోబోతున్నామని తెలిపారు. కరోనా వచ్చిన సమయంలోనూ తట్టుకునేలా వైద్య వ్యవస్థను తెలంగాణలో పటిష్టపరుస్తున్నామని చెప్పారు. 500 టన్నుల ఆక్సిజన్ ను తెలంగాణలో ఉత్పత్తి చేసుకుంటున్నామని తెలిపారు. పదివేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. పారా మెడికల్ సిబ్బందిని కూడా త్వరలోనే నియమిస్తామని చెప్పారు. ప్రతి చోట నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయమని ఆదేశించామని తెలిపారు.