Telangana : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇలా చేయాల్సిందే

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వచ్చె నెల నుంచి ప్రారంభించనుంది.

Update: 2024-12-26 04:07 GMT

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వచ్చె నెల నుంచి ప్రారంభించనుంది. సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కొత్త ఏడాదిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన లబ్దిదారుల ఎంపికతో పాటు నిర్మాణ పనులను కూడా ప్రారంభించే పనిలో అవకాశముంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ లో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్దిదారుల ఎంపిక వచ్చే నెల 7వ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశముంది. సంక్రాంతికి తమ సొంత ఇంటికి భూమి పూజను లబ్దిదారులు చేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

ప్రత్యేకంగా వెబ్ సైట్....
కొత్త ఏడాదిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేకంగా వెబ్ సైట్ తో పాటు, టోల్ ఫ్రీ నెంబరును కూడా ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో చాలా వరకూ అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ, ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి పథకాలు ప్రారంభించింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల కింద లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ఇప్పటికే గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను నియమించారు. తొలి విడతగా సొంత స్థలం ఉన్న వారిని ఈ పథకం కింద ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇస్తుంది.
వెసులుబాటు ఇస్తూ...
ఇంటిని ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకునే వెసులుబాటును పేదలకు కల్పించింది. తమ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవచ్చు. రెండు అంతస్థుల భవనాన్ని కూడా నిర్మించుకునేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని, ఇందులో ఎలాంటి షరతులు లేవని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ముందుగా రోజువారీ కూలీలు, గిరిజన ప్రాంతాల్లో ఇళ్లను మంజూరు చేయనున్నారు. లబ్దిదారుల ఎంపిక పూర్తయిన వెంటనే నిధులను విడుదల చేస్తారు. నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లను నిర్మించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన లబ్దిదారులు ఈ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు. అలాగే త్వరలో ఏర్పాటు కానున్న టోల్ ఫ్రీ నెంబరుకు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.




 ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


Tags:    

Similar News