సినీ పరిశ్రమకు మా పూర్తి సహకారం ఉంటుంది : హోం మంత్రి

సినీ పరిశ్రమ ఇబ్బందులను గమనించి, టికెట్ల రేట్లపై సరైన నిర్ణయం తీసుకోవాలని స్వయంగా స్టార్ హీరోలే వచ్చి సీఎంను అడిగినా..

Update: 2022-03-02 06:56 GMT

హైదరాబాద్ : కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో టాలీవుడ్ పేరు బాగా వినిపిస్తుంది. ఇందుకు కారణమేంటో తెలిసిందే. సినీ పరిశ్రమను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని, పెద్ద సినిమాల విడుదల సమయంలో సినిమాల టికెట్ల రేట్లను పెంచాలని సినీ పెద్దలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టాలీవుడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కు ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించి, టికెట్ల రేట్లను పరిధిమేర పెంచింది. కానీ ఏపీలో మాత్రం.. ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

సినీ పరిశ్రమ ఇబ్బందులను గమనించి, టికెట్ల రేట్లపై సరైన నిర్ణయం తీసుకోవాలని స్వయంగా స్టార్ హీరోలే వచ్చి సీఎంను అడిగినా పట్టించుకోని పరిస్థితే కనిపిస్తోంది. తెలంగాణలో మాత్రం మంత్రులు సినిమాల ఫంక్షన్లకు హాజరవుతూ.. పరిశ్రమకు తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్తున్నారు. ఇటీవల జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ 'సదా నన్ను నడిపే' అనే సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. పరిశ్రమకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న ఆయన.. టాలీవుడ్ కు హైదరాబాద్ చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. వచ్చే ఐదేళ్లలో చిత్ర నిర్మాణంలో హైదరాబాద్ దేశానికి మరో ముంబయిలా మారుతుందని జోస్యం చెప్పారు. అలాగే టాలీవుడ్ కు సీఎం కేసీఆర్ సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.


Tags:    

Similar News