అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటనలో స్వల్ప మార్పులు

కేంద్ర సర్కార్‌ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్‌లో వేగంగా..

Update: 2023-09-16 04:27 GMT

కేంద్ర సర్కార్‌ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్‌లో వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇది విలీనమో.. విమోచనమో లేక సమైక్యతా దినమో తేల్చుకుందాం రా.. అంటూ సవాల్ విసురుతోంది బీజేపీ. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం హైదరాబాద్‌‌కు రానున్నారు. అయితే, అమిత్ షా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈనెల 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరు కానున్న అమిత్‌ షా.. శనివారం రాత్రి 7 గంటలా 20 నిమిషాలకు అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలుస్తోంది. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి నేరుగా సీఆర్పీఎఫ్‌ సెక్టార్‌ మెస్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. విమోచన దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ బీజేపీ.

☛ 17వ తేదీ ఉదయం 9 గంటలకు అమిత్‌ షా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ చేరుకుంటారు. ముందుగా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు.

☛ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు.

☛ ఉదయం 11 గంటలా 10 నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవాలు, తర్వాత ఆయన ప్రసంగిస్తారు.

☛ వేడుకల అనంతరం 11గంటలా 15 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి సీఆర్‌పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరుకుంటారు.

☛ విమోచన దినోత్సవాల్లో పాల్గొన్న తర్వాత 11:50 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు సీఆర్‌పీఎఫ్‌ సెక్టార్‌లోనే ఉంటారు.

☛ ఈ రెండు గంటల్లో బ్యాడ్మింటన్‌ పీవీ సింధుతోపాటు మరికొందరితో అమిత్‌ షా భేటీ అవుతారు.

☛ సీఆర్ పీఎఫ్ మెస్ నుంచి ఒంటి గంటా 45 నిమిషాలకు షా శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరతారు.

☛ 2 గంటలా 25 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

Tags:    

Similar News