డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ముందస్తు ఎన్నికల పొత్తుపై అధికార బీఆర్‌ఎస్ ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. BRS అధ్యక్షుడు, ముఖ్యమంత్రి K. చంద్రశేఖర రావు పార్టీ మొత్తం 104 మంది ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఎన్నికల అనంతర పొత్తులను పార్టీ పరిశీలిస్తుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేసి రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది కూడా గెలిచి తమ పార్టీ ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంటుందని, సొంతంగా ఆ ఘనత సాధించాలని భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రస్తుతం పొలిటికల్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంది.
నవంబర్ 2022లో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో, బీజేపీని ఓడించడానికి BRS వామపక్షాలతో ముందస్తు ఎన్నికల కూటమిని ఏర్పాటు చేసి విజయం సాధించింది. అయితే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఇదే వ్యూహాన్ని అవలంభించే పరిస్థితి కనిపించడం లేదు. వామపక్ష పార్టీలతో BRS యొక్క ఎన్నికల అవగాహన కేవలం మునుగోడుకు మాత్రమే పరిమితం అయిందని కూడా అంటున్నారు. మునుగోడు ఎన్నికలు జరిగి ఏడు నెలలు గడుస్తున్నా వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్యమంత్రి వైపు నుంచి ఎలాంటి చొరవ కనిపించడం లేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు సీపీఐ, సీపీఎం ఇప్పటికే ఒక అంగీకారం కుదుర్చుకుని ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోని మరికొన్ని నియోజకవర్గాల్లో తమ సత్తా చాటడం కోసం కార్యకలాపాలు వేగవంతం చేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా వామపక్ష నేతలు తమను పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నాయకత్వంపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్‌తో పాటు బీజేపీని వ్యతిరేకిస్తున్న ఇతర పార్టీలను వామపక్షాలు కలిసే అవకాశం కూడా లేకపోలేదని ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ఇటీవల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత, ఎన్నికల పొత్తుల కోసం తమకు కొత్త ఆప్షన్స్ వచ్చాయని చెప్పారు. అవిభాజ్య ఖమ్మం జిల్లాలో వామపక్షాలు మెజారిటీ సీట్లు కోరుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని గ్రామాల్లో వామపక్ష పార్టీలకి మంచి ప్రాభల్యం ఉంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని కొన్ని సీట్లను కూడా వామపక్షాలు కోరుతూ ఉన్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు కొన్ని సీట్లు గెలుచుకుని, హంగ్ ఏర్పడితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి BRS నాయకత్వం వామపక్ష పార్టీలతో పొత్తుకు ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశామే లేదని కూడా అంటున్నారు.