Revanth Reddy : రేవంత్ రెడ్డికి శత్రువులు వాళ్లేనా?
రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఇచ్చిన హామీల అమలుపై కొంత చర్చ జరుగుతుంది. కానీ పోలీసుల తీరు ఇబ్బందిగా మారిందంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఇచ్చిన హామీల అమలుపై కొంత చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్య యుతంగా జరుగుతుందన్న భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతుంది. బాధితులు తమ గోడు చెప్పుకునే వీలు కలుగుతుంది. అయితే శాంతిభద్రతలు సమస్య మాత్రం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా తయారయింది. ప్రతిసారీ ఏదో ఒకరూపంలో లా అండ్ ఆర్డర్ ప్లాబ్లమ్ ఆయనను వెంటాడుతుంది. లగచర్ల ఘటన నుంచి ఇది మరింత తీవ్రమయింది. తాజాగా లగచర్ల రైతులను బేడీలు వేయించి ఆసుపత్రికి తీసుకు వచ్చిన ఘటన కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెట్టింది. అస్సలు పోలీసుల వైఫల్యం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుందనే చెప్పాలి.
మంచి అధికారులనే...
వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించగానే మంచి అధికారులనే నియమించారు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులే ఇప్పుడు కూడా ఉన్నారు. పెద్దగా మార్పులు చేయలేదు. అయినా సరే రేవంత్ రెడ్డికి పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. హోంశాఖ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉండటంతో శాంతి భద్రతల సమస్యకు నేరుగా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. లగచర్ల రైతు హీర్యానాయక్ కు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఆయనను సంగారెడ్డి జైలు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే హీర్యానాయక్ కు సంకెళ్లు వేయడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. విపక్షాలకు ఈ ఘటన వరంగా మారింది.
విపక్షాలకు వరంగా...
సంఘటన జరిగిన వెంటనే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రేవంత్ పాలనలో రైతులకు బేడీలు వేయడం పై వారు అభ్యంతరం వ్యక్తంచేశారు.దీంతో సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ పై చర్యలకు ప్రభుత్వం దిగాల్సివచ్చింది. నిజానికి రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండానే ఈ ఘటన జరిగినప్పటికీ దానికి బాధ్యత మాత్రం ఆయన వహించాల్సి వచ్చింది. లగచర్ల ఫార్మాసిటీ ఆలోచనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ ఘటన మాత్రం రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా తయారైంది. పోలీసుల వైఫల్యంతోనే కలెక్టర్ పై దాడి జరగడంతోనే ఇంతటి రచ్చఅయింది. అల్లు అర్జున్ అరెస్ట్ పై కూడ ా బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. ఈసమస్య నుంచి బయటపడాలంటే ఇకనైనా రేవంత్ రెడ్డి శాంతిభద్రతల సమస్యలపై ప్రత్యేకదృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ కూడా రేవంత్ సర్కార్ కు ఒకింత ఇబ్బందిగా తయారైంది. రాజకీయ ప్రమేయం ఉందన్న విమర్శలు పెద్దయెత్తున వినిపించాయి. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ లో తన ప్రమేయం ఏమీ లేదని ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ ఆయన అభిమానులతో పాటు కొందరు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
కరెంట్ కోతలు...
ఇక విద్యుత్తు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వంలో ఇన్వెర్టర్ల వాడకం అనేది ఉండేదికాదన్నది యదార్ధం. కానీ ఇప్పుడు తరచూ కరెంట్ సమస్య తలెత్తుతోంది. శీతాకాలంలోనూ విద్యుత్తు కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో విద్యుత్తు సమస్య అనేకచోట్ల తలెత్తుతుంది. నిర్వహణ కోసం కొన్ని గంటలు, తర్వాత మళ్లీ కోతల పేరిట విద్యుత్తును తరచూ కట్ చేస్తుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసు, అటు విద్యుత్తు సిబ్బంది కూడా రేవంత్ ప్రభుత్వంపై పగ బట్టినట్లుంది. అందుకే ఈ రెండు శాఖలపట్ల రేవంత్ కొంత జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. లేకుంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ రెండు విషయాల్లో ఏడాదిలో రేవంత్ సర్కార్ వైఫల్యమయిందంటే దానికి కారణం పోలీసు, కరెంట్ శాఖలకు చెందిన వారేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.