Telangana : ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదే...మంత్రి పదవి వస్తుందా? రాదా? నేతల్లో టెన్షన్
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం దగ్గరపడింది. వచ్చే నెల 3వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలిసింది;

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం దగ్గరపడింది. వచ్చే నెల 3వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలిసింది. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే పలువురు హైకమాండ్ కు తమకు అవకాశం కల్పించాలంటూ వినతులను సమర్పిస్తున్నారు. ఈ దఫా నలుగురికి అవకాశం ఇచ్చేందుకు హైకమాండ్ అంగీకరించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ నలుగురు ఎవరు? అన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసి దాదాపు పదిహేడు నెలలు కావస్తున్నా ఇంకా ఆరు ఖాళీలు రేవంత్ కేబినెట్ లో ఉండటంతో వాటిలో నాలుగు మాత్రమే భర్తీ చేసి మరో రెండింటిని ఖాళీగా ఉంచాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది.
తమకు అవకాశం కల్పించాలని...
అయితే ఇప్పటికే లంబాడీలు తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ను కోరారు. హైదరాబాద్ నగరానికి మంత్రి వర్గంలో ప్రాధాన్యత లేనందున తమకు కూడా అవకాశం కల్పించాలని నగర ఎమ్మెల్యేలు కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎవరూ గెలవకపోవడంతో శివారుప్రాంతాల్లో గెలిచిన వారంతా ఒక్కటయి ఈ ప్రతిపాదనను లేవనెత్తారు. ఇక మాదిగ కులాలకు కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇలా సామాజికవర్గంతో పాటు ప్రాంతాల వారీగా నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. ఆ నలుగురి పేర్లను ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేసీ వేణుగోపాల్ ఖరారు చేయడంతో పాటు రాహుల్ గాంధీ కూడా ఓకే చెప్పారని తెలిసింది.
వీరి పేర్లు పరిశీలనలో...
గతంలో తాము ఇచ్చిన హామీ మేరకు ఇద్దరు నేతలకు అవకాశం ఇస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో జిల్లాకు ప్రాతినిధ్యం దొరకని నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతగా తనకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. అదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్ పేరు కూడా ఖరారయిందని, బీసీ కోటా కింద వాకిటి శ్రీహరి పేరుకు ఓకే చెప్పారని తెలిసింది. ముదిరాజ్ సామాజికవర్గం కావడంతో శ్రీహరికి ఖచ్చితంగా పదవి దక్కే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఢిల్లీ నుంచి నేతలకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఫోన్ కోసం ఈ నేతలంతా ఎదురు చూస్తున్నారు. మరో వైపు తమకు అవకాశం కల్పించాలని ఇతర నేతలు కూడా అంతేస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తనకు హోంశాఖ కావాలని కూడా మనసులో మాట బయటపెట్టారు. మరి చివరకు నలుగురు ఎవరో అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది