టీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా రాఘవేందర్ సస్పెండ్
పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేందర్ ను
పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేందర్ ను టీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అతనిపై వచ్చిన ఆరోపణలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఇదిలా ఉండగా.. వనమా రాఘవేందర్ అరెస్ట్ పై అనిశ్చితి కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్ లో అతడిని అరెస్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదని పోలీసులు ఖండించడంతో రాఘవేందర్ ఆచూకీపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం అతని కోసం 8 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ.. ఆయన నిన్న బహిరంగ లేఖను విడుదల చేశారు. రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడే ముందు రాసిన సూసైడ్ నోట్ తో పాటు, సెల్ఫీ వీడియోలోనూ వనమా రాఘవేందర్ ప్రస్తావన ఉండడంతో అతడిపై పాల్వంచ పీఎస్ లో కేసు నమోదైంది.