ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. జర భద్రం

జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది

Update: 2023-07-17 02:47 GMT

తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక సోమవారం కూడా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో  సంగారెడ్డి, వికారాబాద్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 18న ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిసా- పశ్చిమ బెంగాల్‌ తీరాల్లో ఉన్న ఆవర్తనం ప్రభావం వల్ల ఒడిసా- పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని తెలిపింది. రాగల రెండు రోజుల్లో దక్షిణ వాయవ్య దిశలో జార్ఖండ్‌ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, సీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18 నుంచి ఉత్తరకోస్తా, 1 నుంచి కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో వానలు బాగా కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈనెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని.. ఈ ప్రభావంతో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. సోమవారం ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జులై 18 నుంచి 20 వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి.


Tags:    

Similar News