ట్యాంక్ బండ్ వద్ద షర్మిల ఆమరణదీక్ష
హైకోర్టు అనుమతిచ్చినా.. న్యాయస్థాన తీర్పును సైతం అగౌరపరుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో తాను పాదయాత్ర..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు తన పాదయాత్రను అనుమతించకపోవడానికి నిరసనగా షర్మిల దీక్షకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించి దీక్షను ప్రారంభించారు. షర్మిలకు సంఘీభావంగా పెద్దసంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తన పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు.
హైకోర్టు అనుమతిచ్చినా.. న్యాయస్థాన తీర్పును సైతం అగౌరపరుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో తాను పాదయాత్ర చేయడం వల్ల వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. వైఎస్సార్టీపీ పాదయాత్రతో టీఆర్ఎస్ బండారం బయటపడుతుందని భయపడే తమను అడ్డుకుంటున్నారన్నారు. 85 నియోజకవర్గాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా సాగిన పాదయాత్రకు ఇప్పుడు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం తగదన్నారు. కాగా.. షర్మిల పాదయాత్రతో ట్యాంక్ బండ్ వద్ద ట్రాఫిక్ జాం అవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. దాంతో వైఎస్ఆర్టిపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.