ప్రధాని నరేంద్ర మోదీకి భయపడే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ లో జరిగిన సమరభేరి సభలో అమిత్ షా మాట్లాడుతూ... కేసీఆర్ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పేదలకు డబుల్ బేడ్రూం ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి ఐదేళ్లలో కేవలం ఐదు వేల ఇళ్లు కూడా కట్టించలేకపోయారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం రూ.99 వేల కోట్లు కేటాయించినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, రాష్ట్రంలో 4,500 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. కేవలం ఎంఐఎంకి భయపడే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అధికారికంగ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తే బీసీలకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను నమ్మకద్రోహం చేసిన టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.