వందేళ్ల ‘ఆరోగ్య సిరి’కి వందనాలు
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అత్యుత్తమ వైద్య కళాశాలగా పేరు పొందిన విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల (ఏఎంసీ) ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంది,. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు కళాశాల శతాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు.
శతాబ్ది ఉత్సవాల శోభలో ఆంధ్ర మెడికల్ కళాశాల
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అత్యుత్తమ వైద్య కళాశాలగా పేరు పొందిన విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల (ఏఎంసీ) ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంది,. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు కళాశాల శతాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఇక్కడే వైద్య విద్యను అభ్యసించి దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారని శతాబ్ది ఉత్సవ కమిటీ ఛైర్మన్ డాక్టర్ టి. రవిరాజ్ పేర్కొన్నారు,
32మంది ప్రారంభమై....
1923లో ప్రారంభమైన ఆంధ్రా మెడికల్ కళాశాల ఎంతో మంది నిష్ణాతులైన వైద్యులను ప్రపంచానికి అందించింది. ఇప్పటికీ ఆంధ్ర మెడికల్ కళాశాలలో సీటు రావడాన్ని ఓ గొప్ప విజయంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తారు. 1923లో కేవలం 32 మంది వైద్య విద్యార్థులతో ఈ కళాశాల ప్రారంభమైంది. ప్రస్తుతం 250 మంది విద్యార్థులకు ప్రతీ ఏటా ఎంబీబీఎస్‌లో ప్రవేశం కల్పిస్తున్నారు. 1950 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. ప్రతీ ఏటా వివిధ విభాగాల్లో 363 మందికి పీజీ సీట్లను అందిస్తున్న పెద్ద కళాశాల్లో ఏఎంసీ ఒకటి. దేశంలో ఉన్న ఏడు పురాతన కళాశాలల్లో ఆంధ్రా మెడికల్ కళాశాల ఒకటి కావడం విశేషం. దీనికి అనుబంధంగా ఉన్న కేజీహెచ్ (కింగ్ జార్జి హాస్పిటల్)ను 1902లోనే ఏర్పాటు చేయడం గమనార్హం. 120 ఏళ్లుగా కేజీహెచ్ ఉత్తరాంధ్ర వాసులను ఆరోగ్య ప్రదాయనిగా ఉంటోంది.
తొలుత వైజాగపటం వైద్య కళాశాల
ఏఎంసీని ప్రారంభించిన కొత్తలో వైజాగపటం వైద్య కళాశాల అని పిలిచేవారు. బ్రిటీష్‌వాళ్లు విశాఖపట్నాన్ని అలాగే పిలిచేవారు. అందుకే ఉత్తరాంధ్రవాసులు విశాఖను వైజాగ్ అని కూడా పిలుస్తారు. 1940లో ఆంధ్రా మెడికల్ కళాశాలగా పేరు మారుస్తూ గెజిట్ జారీ చేశారు. కరోనా సమయంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పరీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఏఎంసీని మాత్రమే ఎంపిక చేశారు. ఆ వ్యాక్సిన్‌ను చాలామంది పేషెంట్ల మీద పరీక్షించిన తర్వాతే అది సమర్థంగా కరోనాను నియంత్రించగలదని నిర్ధరించారు.
ఎంతో మంది ఉద్ధండులు
ఏఎంసీలో చదువుకున్న ఎంతో మంది తర్వాత విఖ్యాత వైద్యులుగా పేరు తెచ్చుకున్నారు. ఉలిమిరి రామలింగస్వామి, శ్రీపాద పినాకపాణి, వ్యాఘ్రేశ్వరుడు, బ్రహ్మయ్యశాస్త్రి, రాజారామ్మోహనరెడ్డి, రామలింగస్వామి, బ్రహ్మయ్యశాస్త్రి, టి.రవిరాజ్... ఇలా ఎంతోమంది గొప్ప వైద్యులుగా పేరు తెచ్చుకుని వేలాది రోగులకు స్వస్థత చేకూర్చారు. ఆంధ్ర మెడికల్ కళాశాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థులు కళాశాల కోసం ఓ భవనాన్ని నిర్మించారు. ఏఎంసీ సమీపంలోనే 1.6 ఎకరాల ఖాళీ స్థలంలో యాభై కోట్ల రూపాయలతో ‘శతాబ్ది భవనాన్ని’ శుక్రవారం ఉప రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.