జగన్ ఫైనల్ వార్నింగ్.. ట్రబుల్ లో పడేదెవరు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. దాదాపు మూడు లక్షల కుటుంబాలకు జగన్ ఈ నాలుగేళ్లలో నేరుగా నగదు అందించి వివిధ రకాలుగా లబ్ది చేకూర్చారు. ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు దక్కేలా పథకాలను ప్లాన్ చేసి మరీ అందుకోసం క్యాలెండర్ రూపొందించి బటన్ నొక్కుతున్నారు. తాను చేసే ఈ కార్యక్రమమే మరోసారి వైసీపీకి అధికారం తెచ్చిపెడుతుందన్న పూర్తి విశ్వాసంతో ఉన్నారు. విపక్షాలు ఎన్ని కలసి వచ్చినా తనకున్న ఓటు బ్యాంకు చెక్కు చెదరదని ఆయన ప్రగాడ నమ్మకాన్ని నేతల ముందు పదే పదే చెబుతున్నారు.
సంక్షేమ పథకాలతోనే...
కేవలం సంక్షేమ పథకాలను పంచడంతోనే సరిపెట్టకుండా గడప గడపకు ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపుతున్నారు. ఒక్కో కుటుంబానికి ఎంత సొమ్ము ముట్టింది, ఏ ఏ పథకాలు అందాయన్నది స్పష్టంగా ఒక బ్రోచర్ ను ఇంటి యజమానికి ఇస్తున్నారు. అది కొంత వరకూ సత్ఫలితాలనిస్తుందని ఆయన భావిస్తున్నారు. అక్కడక్కడ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అది ఇతర పార్టీల నేతలు, తనను వ్యతిరేకించే మీడియా చేస్తున్న హడావిడి తప్పించి మరేదీ కాదని ఆయన అనుకుంటున్నారు. అందుకే గడప గడపకు ప్రభుత్వాన్ని ఆపకుండా ప్రజల వద్దకు వెళ్లాల్సిందేనంటూ ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు. నివేదికలు తెప్పించుకుంటున్నారు.
ఇంటింటికి స్టిక్కర్...
కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలపై పేర్లను నేరుగా సమావేశంలో చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక తాజాగా ఆయన పథకం అందుకున్న ప్రతి ఇంటికీ స్టిక్కర్ అంటించాలని నిర్ణయించారు. ఆ ఇంటి ఓట్లు పక్కకు వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికే వాలంటీర్లతో ఓటర్లకు దగ్గరయిన జగన్ మరింత దగ్గరయ్యేందుకు గృహసారధుల కాన్సెప్ట్ ను తీసుకు వచ్చారు. ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు గృహసారధులను నియమించాలని ఆదేశించారు. దీనిపై ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పనితీరు మారని ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేల పనితీరు అసంతృప్తిగా ఉందని జగన్ పలు సమావేశాల్లో బహిరంగంగానే తెలిపారు.
పనితీరు మార్చుకోకుంటే...?
ఇప్పుడు కొందరికి ఫైనల్ వార్నింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఆరు నెలల ముందే జగన్ అభ్యర్థులను ఖారారు చేయాలని నిర్ణయించారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఆరు నెలల్లో ఇప్పటి వరకూ మెరుగుపడని ఎమ్మెల్యేల పనితీరు వారి గ్రాఫ్ పెరుగుతుందని జగన్ భావించడం లేదు. అందుకే ఒకసారి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ యోచిస్తున్నారు. ఇప్పటికే పీకే టీంతో పాటు తనకు నమ్మకమైన సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం జగన్ కొందరి ఎమ్మెల్యలను హెచ్చరించనున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం కష్టమేనని నిర్మొహమాటంగా చెప్పేందుకు జగన్ సిద్ధమవుతున్నారని సమాచారం.
పల్లె నిద్రతో...
మరోవైపు జగన్ కూడా స్వయంగా ప్రజల వద్దకు వెళ్లేందుకు కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. పల్లె నిద్ర పేరుతో గ్రామాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రోగ్రాం డిజైన్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది. నియోజకవర్గానికి ఒక చోట పల్లె నిద్ర చేయాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నారని సమాచారం. 175 నియోజకవర్గాలను గెలిచి తీరాల్సిందేనన్న లక్ష్యంతో వెళితేనే మరోసారి అధికారంలోకి రాగలనన్న భావనతో ఉన్న జగన్ తన పర్యటనల ద్వారా కార్యకర్తలు, నేతల్లో జోష్ నింపేందుకు ప్రయత్నాలను త్వరలోనే ప్రారంభించనున్నారు. రాజధాని అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పల్లె నిద్ర కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ ఏడాది మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఉండేలా మరొక కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఆయన ఎన్నికలకు వెళ్లనున్నారు. అంతే తప్ప ముందస్తు ఎన్నికలకు వెళ్లరన్నది పార్టీ నుంచి వినిపిస్తున్న టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.