ఎవరీ లక్ష్మీనారాయణ.... రాధాకృష్ణకు సంబంధం ఏంటి?

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Update: 2021-12-11 02:11 GMT

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏపీ స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేశారు. లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబు వద్ద ఓఎస్డీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ లక్ష్మీనారాయణ చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించేవారు.

సోదాలు జరిగిన సమయంలో....?
నాడు సచివాలయంలో సీనియర్ అధికారులకన్నా లక్ష్మీనారాయణకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఆయన చంద్రబాబుతో ఎస్వీ యూనివర్సిటీలో చదువుకున్నారు. అత్యంత సన్నిహితుడు. కమ్మ సామాజికవర్గానికి చెందిన లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు జరిగిన సమయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, పీఏసీ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ లు అక్కడికి వచ్చి ఆయనకు అండగా నిలిచారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడమేంటని నిలదీశారు.
ప్రభుత్వ సలహాదారుగా...
లక్ష్మీనారాయణ ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత కొంతకాలం చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ కు సేవలందించారు. హెరిటేజ్ ను అభివృద్ధి పథంలో నడపటంలో ఈయన పాత్ర కీలకమంటారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. అయితే ఇదే సమయంలో స్కిల్ డెవెలెప్ మెంట్ కార్పొరేషన్ కు సేవలంందించారు. ఈ కేసులో ఏ 2 గా కేసు నమోదు చేసింది.
అవకతవకలు జరిగాయని....
అయితే పూణేకు సంబంధించిన వివిధ సంస్థల్లో జీఎస్టీ సోదాల్లో ఈ అవకతవకలు వెలుగు చూసినట్లు సమాచారం. మొత్తం నాలుగు షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ విషయాలు వెల్లడయ్యాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేశారు. మాజీ స్పెషల్ సెక్రటరీ గంటా సుబ్బారావు, నిమ్మగడ్డ వెంకటకృష్ణతో పాటు ఐటీ స్మిత్ సొల్యూషన్, పాత్రిక్ సర్వీసెస్, ఇన్ వెబ్ సర్వీసెస్, డిజైన్ టెక్ సర్వీసెస్ వంటి వాటికి చెందిన పలువురు డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఈ నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించారని ఆరోపణ చేస్తుంది ఏపీ సీఐడీ.
రాజకీయ దాడులు...
అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం వీటిని రాజకీయ దాడులుగానే చూస్తుంది. వన్ టైమ్ సెటిల్ మెంట్, ఉద్యోగ సంఘాల ఆందోళన వంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ కేసును ప్రభుత్వం సృష్టించి హడావిడి చేస్తుందని పయ్యావు కేశవ్ ఆరోపిస్తున్నారు. అవినీతి జరిగి ఉంటే అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ ను కూడా అరెస్ట్ చేయాలి కదా? అని పయ్యావుల ప్రశ్నించారు. చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.



Tags:    

Similar News