కేసీఆర్ కు రెడ్డి ఎమ్మెల్యేల షాక్‌.. ఫ‌లిస్తున్న‌ కాంగ్రెస్ వ్యూహం

Update: 2018-06-05 15:00 GMT

ఎన్నిక‌ల ఏడాదిలో రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కుతోంది. ఏపీలో ఇప్ప‌టికే త్రిముఖ పోరుకు సిద్ధ‌మ‌వ‌గా.. తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే పెను మార్పులు జ‌రుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ప్ర‌తిప‌క్షాల‌న్నీ ప్ర‌య‌త్నిస్తున్నా అది సాధ్యం కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే సామాజిక‌వ‌ర్గ ప‌రంగా ఢీ కొనేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్య‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గీయులంతా ఏక‌తాటిపైకి వ‌చ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు పొలిటిక‌ల్ వేడి పెంచుతున్నాయి. ఇవ‌న్నీ టీఆర్ఎస్‌లోని రెడ్డి సామాజిక నేత‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. కొంత‌మంది నేత‌ల‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న‌ట్లు స‌మాచారం. అంతేగాక కొంద‌రు నేత‌లు పార్టీ జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఇందుకు సంబంధించిన నివేదిక కేసీఆర్ వ‌ద్ద‌కు చేరింద‌ని పార్టీ వ‌ర్గాలు స్ప‌ష్టంచేస్తున్నాయి.

రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి...

శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడు.. అన్న‌చందంగా మారింది తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితి. బ‌ల‌మైన కేసీఆర్‌ను ఢీ కొట్టాలంటే ఒంట‌రిగా సాధ్యం కాద‌ని నిర్ణ‌యించిన నేత‌లు ఒక ద‌రికి చేరుతున్నారు. బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గంగా పేరొందిన రెడ్లు ఇప్పుడు చేయిచేయి క‌లుపుతున్నార‌నే వార్త‌లు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఏపీ ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌పుడు ఎక్కువ‌కాలం సీఎం గిరీ చేసిన నేతల్లో రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే ఎక్కువ. కానీ విభ‌జ‌న త‌ర్వాత‌.. అటు ఏపీలో టీడీపీ, ఇటు తెలంగాణాల్లో టీఆర్ ఎస్‌లు స‌ర్కారును ఏర్పాటుచేశాయి. ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వార‌యితే మ‌రొక‌రు.. వెలమ వర్గానికి చెందిన వారు. దీంతో రెడ్డి వ‌ర్గాన్ని ఆదుకునేందుకు సరైన‌ నేతలెవ‌రూ క‌నిపించ‌డం లేదు. అంతేగాక ఏపీతో పోల్చితే తెలంగాణ‌లో రెడ్లు కొంత అణిచివేత‌కు గుర‌వుతున్నార‌నే చ‌ర్చ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

అంతా వారి హవానే...

ఆంధ్రా విషయం పక్కన పెడితే తెలంగాణాలో అన్ని విధాలా బలమైన నేత‌లు రెడ్డి వ‌ర్గంలోనే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు అధ్య‌క్షుడు రెడ్డి, అంతేగాక ముఖ్య నేత‌లంద‌రూ ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ కూడా త‌న చుట్టూ అదే వ‌ర్గాన్ని ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఉంచుకున్నార‌నే వాదన కూడా ఉంది. పేరుకు మాత్ర‌మే పెత్తన‌మ‌ని.. ఏ జీవో విడుద‌ల చేయాల‌న్నా కేటీఆర్‌, హ‌రీష్‌రావు వంటి వారి ప‌లుకుబ‌డి మాత్ర‌మే సాగుతుంద‌ని చేతుల్లో ఏమీ లేద‌నే వాద‌న కూడా చాలా మంది రెడ్డి సామాజిక వర్గ మంత్రుల్లో ఉంది. అందుకే రాబోయే ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌నే ప్లాన్ సిద్ధం చేస్తున్నార‌ట‌.

చేతులు కలుసుతున్న నేతలు...

దానిలో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి, నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి.. త్వ‌ర‌లో మ‌రో కీల‌క రెడ్డి నేత‌ కూడా హ‌స్తం అందుకోనున్నట్టు తెలుస్తోంది. గ‌తంలో ఈ వర్గానికి చెందిన కొంత‌మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని స‌మావేశం నిర్వ‌హించార‌ని, వీరు ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పార్టీ మారొచ్చ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. అయితే కేసీఆర్ జోక్యంతో ఆ త‌రువాత‌ అందంతా ఒట్టిదేనంటూ కొట్టిపారేశారు. ఇది నిజ‌మేనంటూ నిఘావిభాగం ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌టం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. అధికార పార్టీలో త‌మ‌ వర్గానికే అగ్రతాంబూలం ఇవ్వాలని అలా ఇచ్చిన పార్టీ నే గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ నేప‌థ్యంలో వీరు వచ్చే ఎన్నికల్లో వీరిని ఎలా నియంత్రిస్తారో వేచిచూడాల్సిందే!

Similar News