ఈ పార్టీ జబ్బుకి మాత్ర మాత్రం లేదట

తెలంగాణలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పలచనవుతున్నారు

Update: 2022-12-04 04:21 GMT

రాహుల్ గాంధీ తెలంగాణ జోడో భారత్ పాదయాత్ర పూర్తి చేసి దాదాపు నెల గడుస్తుంది. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని దాటి మహారాష్ట్రలో కూడా యాత్రను పూర్తి చేశారు. మధ్యప్రదేశ్ ను కూడా పూర్తి చేసుకుని త్వరలో రాజస్థాన్ కు కూడా చేరుకుంటుంది. అంటే మూడు రాష్ట్రాల్లో రాహుల్ పాదయాత్ర ముగించే పరిస్థితికి వచ్చింది. అయినా తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఇప్పటికీ చురుకుదనం లేదు. నిత్యం పార్టీలో గొడవలు, గ్రూపులు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోనే తంతును ముగించేస్తున్నారు. అంతే తప్ప పార్టీని బలోపేతం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.


కర్ణాటకలో చూస్తే...

రాహుల్ భారత్ జోడో యాత్ర పూర్తి కాగానే ఏ రాష్ట్రంలోనైనా ఏం చేయాలి? అందునా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ఏం చర్యలు తీసుకోవాలి? పొరుగున ఉన్న కర్ణాటకలో ఎన్నికలు ఉండటంతో జోడో యాత్ర పూర్తయిన వెంటనే బస్సు యాత్రను ప్రారంభించారు. అక్కడ గ్రూపులున్నా ఐక్యతతోనే పనిచేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీనియర్, జూనియర్ నేతలు కలసి రూట్ మ్యాప్ ను రెడీ చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై సమరభేరిని మోగిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
తెలంగాణలో మాత్రం...
అదే తెలంగాణలోనూ వచ్చే ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? రాహుల్ పాదయాత్రకు లభించిన స్పందనను తమ పార్టీకి అంటిపెట్టుకుని ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకు అందరూ కలసి ప్రజల్లోకి వెళ్లాలి. తామంతా ఐక్యంగా ఉన్నామని తొలుత నేతలు ప్రజలకు చెప్పగలగాలి. కానీ అలాంటి ప్రయత్నమేమైనా జరుగుతుందా? అంటే ఏమీ లేదనే చెప్పాలి. ఆ ప్రయత్నం లేకపోగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దూషించుకుంటున్నారు. తనకు ఎవరూ సహకరించడం లేదన్నది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

విమర్శలను ఖండించే ప్రయత్నం...
నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకుంటే ఎలా సహకరిస్తారని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ నుంచి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ నుంచి వెళుతూ విమర్శలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఆయన విమర్శలను ఖండించే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. ఇలాంటి పార్టీకి ప్రజలు ఎలా అధికారం అప్పగిస్తారన్న ప్రశ్న అనేక మందిలో కలుగుతుంది. పార్టీ హైకమాండ్ ఎవరో ఒకరికి నాయకత్వం అప్పగిస్తుంది. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఆ నేతకు సహకరించాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం రాహుల్ జోడో యాత్ర పూర్తయి ఇన్ని రోజులు గడుస్తున్నా దానికి అనుబంధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ప్రకటిస్తుందా? నేతలు ఐక్యంగా ప్రజల ముందుకు వస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News