అసలు గుజరాత్ లో ఏం జరుగుతోంది..?

Update: 2018-10-08 08:45 GMT

దేశానికి అన్నింటా మోడల్ రాష్ట్రంలో అని చెప్పుకునే గుజరాత్ లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పొట్ట చేత పట్టుకుని ఆ రాష్ట్రానికి వలస వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్న ప్రజలపై కొందరు స్థానికులు దాడులకు దిగుతున్నారు. వారి ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు వలస కార్మికులకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వీరి దాడులు భరించలేక వారం రోజుల్లోనే సుమారు 50 వేల మంది స్థానికేతరులు గుజరాత్ ను విడిచి స్వంత రాష్ట్రాలకు వెళ్లిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మూడు రాష్ట్రాల వారే టార్గెట్...

వివరాల్లోకెళితే... గత నెల 28న సబర్ కంట జిల్లాలోని హిమ్మత్ నగర్ అనే ప్రాంతంలో 14 నెలల బాలికపై ఓ బిహార్ కు చెందిన రఘువీర్ సాహు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. బిహార్, ఉత్తర ప్రదేశ్ వారు ఇక్కడికి వచ్చి.. తమ మహిళలపైనే ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారనే ధ్వేషం వారిలో రగిలింది. దీనికి సోషల్ మీడియా తోడవడంతో ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి దాడులకు దిగుతున్నారు. బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిపై రాత్రి వేళల్లో దాడులు చేస్తున్నారు. వారి ఆస్తులు సైతం ధ్వంసం చేస్తున్నారు. హిందీ మాట్లాడే వలస కార్మికులను వీరు టార్గెట్ చేస్తున్నారు. దీంతో భయాందోళనలకు గురవుతున్న వలస కార్మికులు వారి స్వరాష్ట్రాలకు పెద్దసంఖ్యలో వెళ్లిపోతున్నారు. ఎవడో నీచుడు చేసిన పనికి వీరంతా ఉపాధి కోల్పోయి, అన్నీ వదులుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎవరూ వెళ్లిపోవద్దని కోరుతున్న పోలీసులు

గుజరాత్ లోని సూరత్, అహ్మదాబాద్, గాంధీ నగర్ సహా ఏడు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మెహసన, సబర్ కంట జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో పోలీసులు 42 కేసులు నమోదు చేసి 342 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. అవసరమైతే వలస కార్మికులు పనిచేసే పరిశ్రమలు, నివాస సముదాయాల వద్ద భద్రత కల్పిస్తామని ఆ రాష్ట్ర డీజీపీ శివానంద్ ఝా అంటున్నారు. ఈ ఘటనలకు భయపడి ఎవరూ రాష్ట్రం వదిలి వెళ్లొద్దని ఆయన కోరారు. స్థానిక నేతలతో కూడా కార్మికులకు భరోసా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, దాడుల నెపంతో తన అనుచరులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఠాకూర్ల నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్ఫేష్ ఠాకూర్ ఆరోపిస్తున్నారు. ఆయన గుజరాత్ లోని కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధన్యత ఇవ్వాలని, రేప్ కు గురైన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులే దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు కొందరిపై కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన అక్టోబర్ 11 నుంచి నిరాహార దీక్షకు దిగనున్నారు.

Similar News