ఇకపై అంతా టెన్షన్ ... ఎలా బయటపడతారో?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఇక మూడు రాజధానులతో అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నట్లే కనిపిస్తుంది

Update: 2022-11-20 03:45 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఇక మూడు రాజధానులతో అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నట్లే కనిపిస్తుంది. ఆయన పర్యటనల్లో నిరసనల సెగ కన్పించడానికి ఇదే కారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇకపై చంద్రబాబు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తే నిరసనల సెగ వెల్లువెత్తే అవకాశాలున్నాయన్నది ఆ పార్టీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. ఆ నిరసనలు చేసేది వైసీపీ కార్యకర్తలా? లేక స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి చేస్తున్నారా? అన్నది పక్కన పెడితే ఆయన పర్యటనల్లో మూడు రాజధానులకు అడ్డుపడవద్దంటూ నినాదాలు మాత్రం చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

డేళ్లవుతున్నా...
జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చి దాదాపు మూడేళ్లవుతుంది. అయితే ఇప్పటి వరకూ దాని ఏర్పాటు సాధ్యం కాలేదు. న్యాయస్థానాల నుంచి అడ్డంకులు కావచ్చు. విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం కావచ్చు. మూడు రాజధానులు మాత్రం ఇంకా ఏర్పాటు కాలేదు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మాత్రం అధికార వైసీపీ దీనిని సెంటిమెంట్ గా ప్రజల్లోకి తీసుకెళ్లనుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. గతంలోనూ చంద్రబాబు రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో పర్యటించినప్పుడు ఇలాంటి నిరసనలు ఎదురుకాలేదు. 

గతంలో చేసినా...
ఆయన అనంతపురం, కడప, చిత్తూరు, అనకాపల్లి, విజయనగరం వంటి జిల్లాల్లో బాదుడే బాదుడే కార్యక్రమంలోనూ, మినీ మహానాడు ప్రోగ్రాంలోనూ పాల్గొన్నారు. జగన్ సొంత జిల్లా కడపలోనే చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. అలాగే చిత్తూరు, అనంతపురం, అనకాపల్లి కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. అప్పుడు ఇలాంటి నిరసనలు ఎక్కడా కన్పించలేదు. విన్పించలేదు. కానీ రెండు రోజుల క్రితం జరిగిన కర్నూలు జిల్లా పర్యటనలో మాత్రం చంద్రబాబుకు ఘాటు నిరసనలు ఎదురయ్యాయి. బీజేపీ కార్యకర్తలు కూడా కొన్ని చోట్ల ఆయన పర్యటనలో మూడు రాజధానులపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారంటే అర్థం చేసుకోవచ్చు.


కర్నూలు నుంచి మొదలు...
రానున్న కాలంలో ఇలాంటి నిరసనలు చంద్రబాబుకు ఎక్కువగా వినిపిస్తాయని చెప్పాలి. చంద్రబాబుకే కాదు పార్టీ యువనేత లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ నిరసనలు ఖచ్చితంగా కనిపిస్తాయని టీడీపీ అంచనా వేస్తుంది. దీనికి విరుగుడుగా ఏం చేయాలన్న దానిపై నిన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. పార్టీ నేతలు నిరసనలు తెలియజేసే వారిని గుర్తించి వెంటనే మీడియా ద్వారా వారు ఏ పార్టీకి చెందిన వారో ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర కూడా అదే మాదిరి అడ్డుకున్నారని, దీనిపై పార్టీ అగ్రనాయకత్వం పర్యటించేటప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించినట్లు చెబుతున్నారు. మరి రానున్న కాలంలో చంద్రబాబు పర్యటనలన్నీ టెన్షన్ ల మధ్యనే కొనసాగుతాయని చెప్పక తప్పదు.


Tags:    

Similar News