తస్మాత్ జాగ్రత్త : రామ మందిరానికి సంబంధించి ఎన్నో స్కామ్ లు ముందుకు వస్తున్నాయి
అయోధ్య రామమందిర ప్రవేశం, ప్రసాదానికి సంబంధించిన మెసేజీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 22న నిర్వహించే ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా వీక్షించాలని ప్రతీ రామ భక్తుడూ కోరుకుంటున్నారు.;
అయోధ్య రామమందిర ప్రవేశం, ప్రసాదానికి సంబంధించిన మెసేజీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 22న నిర్వహించే ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా వీక్షించాలని ప్రతీ రామ భక్తుడూ కోరుకుంటున్నారు. ఆంక్షల కారణంగా అయోధ్యకు వెళ్లడం ప్రజలకు సాధ్యం కావడంలేదు. ఈ క్రమంలో అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ క్రతువును టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ ఈవెంట్ ద్వారా కూడా కొందరు కేటుగాళ్లు ప్రజలను దోచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు భక్తులను మోసం చేసేందుకు పలు రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ వేడుకకు ఉచితంగా VIP పాస్‌లు అందిస్తామని వాగ్దానం చేస్తూ ప్రజలకు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతున్నారు. ఈ మెసేజీలు నకిలీవి.
మెసేజీ ద్వారా వచ్చిన లింక్ ను క్లిక్ చేస్తే ఏపీకే ఫైల్ డౌన్ లోడ్ చేయమని చూపిస్తుంది. అలాంటి ఏపీకే ఫైల్స్ ను మన మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తే మాత్రం ఊహించని ప్రమాదం పొంచి ఉంది. APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయమని మెసేజీలో ఉంది.. వీటిలో మాల్వేర్ దాగి ఉండవచ్చు. అలాంటి నిర్ణయాలు మీ ఫోన్‌ను పాడు చేస్తాయి. ఇది మీడియా ఫైల్‌లు, డాక్యుమెంట్స్, ఆర్థిక పరమైన వివరాలతో సహా స్మార్ట్‌ఫోన్ నుండి కీలక డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది.
“Ram Janmabhoomi Grih Sampark Abhian" “రామ్ జన్మభూమి గృహ్ సంపర్క్ అభియాన్" యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని బిలాస్‌పూర్ పోలీసులు ప్రజలకు కీలక సూచన చేశారు. హానికరమైన సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్ మోసాల గురించి జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద సందేశాల విషయంలో పోలీసులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులు సూచించారు.
ప్రజలు ఇలాంటి యాప్స్, లింక్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని గురుగ్రామ్ సైబర్ పోలీసులు కూడా సలహా ఇచ్చారు. మాట్లాడుతూ.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ మోసాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని, ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. శ్రీరాముడి పేరుతో ఉచిత మొబైల్ రీఛార్జ్ లింక్ లను కూడా పంపారని చెప్పారు. ప్రజలు అలాంటి లింక్ లపై క్లిక్ చేసి తమ అకౌంట్ల లోని డబ్బులను కోల్పోయారని తెలిపారు. డిసిపి (సైబర్) సిద్ధాంత్ జైన్
ఇక శ్రీరామ జన్మభూమి క్షేత్రం పేరుతో విరాళాలు సేకరిస్తున్నట్లు కొందరు మోసగాళ్లు క్యూఆర్ కోడ్ ను పంపిస్తూ ఉన్నారు. అసలైన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు ఈ QR కోడ్ కు ఎలాంటి సంబంధం లేదు.
అయోధ్య ఆలయానికి సంబంధించిన లైవ్ లింక్‌లు, లైవ్ ఫోటోలు అంటూ మీకు వచ్చే ఎలాంటి సందేశాలపై కూడా క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ వింగ్, హైదరాబాద్ హెచ్చరించింది. ఈ లింక్‌లను ఓపెన్ చేస్తే ఫోన్ లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించారు.
అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ప్రసాదం అంటూ కూడా కొందరు కొన్ని స్వీట్స్ ను ప్రజలకు అంటగట్టాలని చూస్తున్నారు. ‘శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాదం’ అంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలతో మిఠాయిలను అమ్ముతున్నారని అమెజాన్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. అమెజాన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో "శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్" అని చెప్పుకునే వివిధ స్వీట్లు/ఆహార ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్ స్కామ్ లతో పాటు, కొన్ని నకిలీ వెబ్‌సైట్‌లు కూడా అయోధ్య రామ మందిరం పేరు చెప్పుకుని మోసాలకు పాల్పడుతూ ఉన్నాయి. అయోధ్య రామమందిరం నుండి కాంప్లిమెంటరీ ప్రసాదాన్ని అందిస్తామని కొన్ని వెబ్ సైట్లలో చెబుతున్నారు. అయితే ప్రసాదం కావాలంటే షిప్పింగ్ ఛార్జీలు చెల్లించాలని ఈ వెబ్‌సైట్ల ద్వారా భక్తుల నుండి డబ్బును గుంజేస్తూ ఉన్నారు. అయితే ఈ వెబ్ సైట్లు ఏవీ కూడా ప్రామాణికమైనవి కావు. అయోధ్య రామమందిరం కోసం విరాళాలు ఇవ్వగల ప్రామాణికమైన వెబ్‌సైట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి చెందినది మాత్రమే. మరే వెబ్ సైట్లను కూడా ప్రజలు సంప్రదించవద్దని అధికారులు సూచిస్తూ ఉన్నారు.