ఈటల ఛాలెంజ్.. రీజన్ అదేనా?

బీజేపీ నేత ఈటల రాజేందర్ ఛాలెంజ్ చేస్తున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో గజ్వేలు నుంచి పోటీ చేయడానికి సిద్దమంటున్నారు.

Update: 2022-07-12 03:24 GMT

బీజేపీ నేత ఈటల రాజేందర్ గతకొద్ది రోజులుగా ఛాలెంజ్ చేస్తున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో గజ్వేలు నుంచి పోటీ చేయడానికి సిద్దమంటున్నారు. ఉత్తుత్తి సవాళ్లేనా? లేక నిజంగానే అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాల మేరకు ఆయన ఈ సవాల్ చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రిగా ఉండి, పార్టీ అధినేతను ఎన్నికల సమయంలో నిలువరించేందుకు సహజంగా బీజేపీ బలమైన నేతను వారిపై పోటీకి ఎంపిక చేస్తుంది. పశ్చిమ బెంగాల్ లో అలాగే చేసింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత బెనర్జీకి పోటీగా బలమైన నేత సువేందు అధికారిని రంగంలోకి దించి ఓడించ గలిగింది. పూర్తి స్థాయి మెజారిటీ వచ్చిన మమత బెనర్జీ ఓటమి పాలయి కొంత ఇబ్బందిపడాల్సి వచ్చింది.

సువేందు అధికారి తరహాలో...
ఇప్పుడు సువేందు అధికారి తరహాలో పార్టీ అధినాయకత్వం ఈటల రాజేందర్ ను ఎంచుకుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బెంగాల్ లో సువేందు అధికారి కూడా టీఎంసీ నుంచి వచ్చిన వారే. ఇక్కడ ఈటల కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన వారే, అధినేతల వ్యూహాలు, గుట్టుమట్టు తెలిసిన వారిని బరిలోకి దించడం బీజేపీ హైకమాండ్ స్ట్రాటజీ అంటున్నారు. అందుకే ఈటల రాజేందర్ ను ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయించాలన్న నిర్ణయం పార్టీ అధినాయకత్వానిదేనన్న ప్రచారమూ ఉంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా బెంగాల్ కు, ఇక్కడకు చాలా వ్యత్యాసం ఉంది.
హుజూరాబాద్ ను కాదని....
ఈటల రాజేందర్ కు హుజూరాబాద్ పెట్టని కోట. ఆయన హుజూరాబాద్ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి వరసగా జరుగుతున్న ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఆయనకు తిరుగులేదు. అలాంటి నియోజకవర్గాన్ని వదులుకుని ఈటల రాజేందర్ గజ్వేల్ కు వస్తారా? వచ్చినా గెలుస్తారా? అన్నది ఆయన అభిమానుల్లో నెలకొన్న సందేహం. ఈటల రాజేందర్ రాష్ట్ర స్థాయి నేతే కావచ్చు. కానీ కేసీఆర్ మీద పోటీ చేసే శక్తి ఆయనకు లేవన్నది విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్న విషయం. గజ్వేలు నియోజకవర్గం పరిస్థితి తెలిసిన వారెవరైనా కేసీఆర్ తో పోటీకి సిద్ధపడరు.
గజ్వేల్ లో సాధ్యమా?
ఎందుకంటే కేసీఆర్ 2014, 2019 ఎన్నికల్లో వరసగా కేసీఆర్ విజయం సాధించారు. ఆయన గెలుపు అక్కడ నల్లేరు మీద నడకే. ఆయన ప్రచారానికి వెళ్లకున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వారి సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రత్యేక అధికారులున్నారు. పార్టీ నేతలున్నారు. ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గాన్ని చాలా వరకూ అభివృద్ధి చేశారు. ప్రజలు సమస్యలు సత్వరం పరిష్కారమవుతున్నాయి. తనకు ఇబ్బందిగా మారిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని కూడా కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు నామినేటెడ్ పదవి కూడా ఇచ్చారు. అక్కడ ఈటల రాజేందర్ పోటీ చేసినా గెలుపు కష్టమేనన్నది అంచనా. మరి ఈటల రాజేందర్ పార్టీ అధినాయకత్వం వత్తిడికి తలొగ్గి బరిలో నిలుస్తానంటున్నారా? లేక కేసీఆర్ ను నిజంగా ఓడించగలనని నమ్మి ఆ మాటలను అంటున్నారా? అన్నది ముందు ముందు తెలిసే అవకాశముంది.


Tags:    

Similar News