కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారింది

తెలంగాణ ఉద్యోగులకు అండగా నిలిచేందుకే తాను వచ్చానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.

Update: 2022-01-04 14:50 GMT

తెలంగాణ ఉద్యోగులకు అండగా నిలిచేందుకే తాను వచ్చానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. తనను ఎయిర్ పోర్టు వద్దనే పోలీసులు అడ్డుకున్నారని, కానీ తాను కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే కార్యక్రమంలో పాల్గొన్నానని జేపీ నడ్డా తెలిపారు. కరోనా నిబంధనలను పాటించాలనే ర్యాలీని రద్దు చేసుకున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తుందని అన్నారు. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని చెప్పారు.

వారసత్వ రాజకీయాలను...
తెలంగాణలో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని జేపీ నడ్డా చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా 317 జీవోను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. దీనిని ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకిస్తే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జేపీ నడ్డా ప్రశ్నించారు. తెలంగాణలో అవినీతి కూడా విపరీతంగా జరుగుతుందన్నారు. దేశంలో కల్లా అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ ముద్రపడిందన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారిందన్నారు. మిషన్ భగీరధ నుంచి మంచినీరు అందరికీ అందించలేకపోయారన్నారు.
వినాశకాలే....
కేసీఆర్ కుటుంబ సభ్యులే లబ్ది పొందుతున్నారని జేపీ నడ్డా ఆరోపించారు. హుజూరాబాద్ లో ఓటమి పాలయిన నాటి నుంచి కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ తప్పిందన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని జేపీ నడ్డా చెప్పారు. తమ పోరాటాలను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత అన్ని వర్గాల్లో కన్పిస్తుందని చెప్పారు. కరోనా తెలంగాణలో రాలేదని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాటలను ప్రదర్శించారు. కరోనాపై ప్రజలకు కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు.


Tags:    

Similar News