జమ్మూ కశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పీడీపీకి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. గవర్నర్ కు లేఖ పంపించింది. దీంతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రమాదంలో పడిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందంపై రెండు పార్టీ మధ్య వివాదం తలెత్తింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కోరుతున్నారు. అయితే, బీజేపీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. రంజాన్ మాసం సందర్భంగా ముఫ్తీ విజ్ఞప్తి మేరకు కేంద్రం కశ్మీర్ లో కాల్పుల విరమణ పాటించింది. అయినా ఉగ్రమూకలు మాత్రం రెచ్చిపోయి ఓ సీనియర్ జర్నలిస్టును, పండుగ కోసం ఇంటికి వెళ్తున్న ఔరంగజేబు అనే ఆర్మీ జవాన్ ను హతమార్చారు. దీనిని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇప్పటికే కేంద్రం సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. పీడీపీకి మద్దతు ఉపసంహరించుకోవడంతో కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఏర్పాటుచేసే అవకాశం ఉంది. మొత్తానికి ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం భారీ చర్యలకు దిగుతుందనేది స్పష్టమవుతోంది.