సొమ్ములన్నీ కరిగిపోతున్నాయా?

చంద్రబాబు ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మహానాడు తెచ్చిన ఊపుతో ఆయన జనంలోకి వెళుతున్నారు.

Update: 2022-07-22 04:18 GMT

చంద్రబాబు ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మహానాడు తెచ్చిన ఊపుతో ఆయన జనంలోకి వెళుతున్నారు. బాగానే ఉంది. తాను అభ్యర్థులను ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రకటిస్తామని చంద్రబాబు పదే పదే చెప్పారు. పార్టీలో ఎవరు కష్టపడితే వారికే టిక్కెట్లు అని కూడా ఖరాఖండీగా చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే కొన్ని జిల్లాల నేతలు తప్ప ఎక్కువ మంది నేతలు ఇప్పటికీ యాక్టివ్ గా లేరు. నియోజకవర్గాల్లో నేతలను యాక్టివ్ చేయడం కోసమే మినీ మహానాడులను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఖర్చు భరించలేమని...
కానీ జనసమీకరణకు మాత్రం ఖర్చు తాము భరించలేమని కొందరు నేతలు చేతులెత్తేసినట్లు కనపడుతుంది. నిధుల కోసం కేంద్ర కార్యాలయం కోసం ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు పెట్టి కొందరు ఉన్న సొమ్మునంతా ఖర్చు చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీ ఇచ్చే నిధులు అరకొర ఉంటాయి. అవి ఏమాత్రం సరిపోవు. తాము అప్పో సప్పో చేసి ఎన్నికలకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి ఉంటుంది.
అనేక మంది నేతలు...
మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి అన్నట్లుగానే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆయన అన్న మాట అక్షర సత్యమని అనేక మంది నేతలు అంటున్నారు. అందుకే నేతలు ఎన్నికలకు రెండేళ్లకు ముందుగానే ఖర్చు చేయడానికి ఇష‌్టపడటం లేదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మినీ మహానాడులు జిల్లాలోని ఒక నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. ఉదాహరణకు మదనపల్లె లో మినీ మహానాడు జరిపితే అక్కడ అభ్యర్థికి మాత్రమే కొంత ప్రయోజనం ఉంటుంది. ఇతర నియోజకవర్గాల నేతలకు ఏ మాత్రం ప్రయోజనం లేదు.
ఇన్‌ఛార్జులను కూడా...
అందుకే రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు, కోస్తాంధ్రలోని కొన్ని నియోజకవర్గాలు, ఉత్తరాంధ్రలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని పదిహేను నియోజకవర్గాల్లో నేతలు ఖర్చుకు వెనకాడుతున్నారని కేంద్ర కార్యాలయానికి వచ్చిన నివేదికను బట్టి తెలుస్తోంది. దీంతో పాటు ఇప్పటి వరకూ రాష్ట్రంలో 30 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులు లేరు. వారిని నియమించేందుకు అనేక సమస్యలను అధినేతకు ఎదురవుతున్నాయి. అందుకే ఇన్‌‌ఛార్జుల నియామకంలో జాప్యం జరుగుతుంది. అక్కడ కూడా నేతలెవ్వరూ ఖర్చు చేసేందుకు అసలు ముందుకు రావడం లేదు.
పార్టీపైనే భారం...
ఈ రెండేళ్లు మాత్రం చంద్రబాబు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అందుకయ్యే ఖర్చును పార్టీయే భరించాల్సి ఉంటుంది. నియోజకవర్గాల్లో నేతలు చేతులు ఎత్తివేయడంతో ఆయన కూడా కొన్ని డిజైన్ చేసిన కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కేంద్ర కార్యాలయం ఖజానాపై భారం ఎక్కువగా పడుతుండటం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. అందుకే ఇటీవల కాలంలో లోకేష్, చంద్రబాబులు తమ పర్యటనలను కుదించుకుంటున్నారు. ప్రధాన కార్యక్రమాలు తప్ప ఇదివరకు మాదిరిగా పార్టీ అగ్రనేతలు జిల్లాల్లో పర్యటించేందుకు వీలులేదన్నది వాస్తవం.


Tags:    

Similar News