నారావారిపల్లెలో భోగి వేడుకలు.. జీవో నం.1ని భోగిమంటల్లో వేసి..
టీడీపీ అధికారంలో తాను ప్రోత్సహించిన ఐటీ సెక్టార్ ఉత్తమ ఫలితాలనిచ్చిందన్నారు. సినిమాల గురించి మాట్లాడుతూ..
నేడు భోగి పండుగ సందర్భంగా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. నారావారిపల్లెలో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. దేశ,విదేశాల్లో ఉన్న తెలుగువారికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీఓ నంబర్ 1ని భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను భోగి మంటల్లో వేసి బూడిద చేశామని, రాష్ట్రంలో సైకో పాలన పోవాలని కోరుకున్నట్టు తెలిపారు. పొట్టిశ్రీరాములు తెలుగు రాష్ట్రాన్ని సాధిస్తే.. ఆ తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్ గౌరవం తీసుకొచ్చారన్నారు.
టీడీపీ అధికారంలో తాను ప్రోత్సహించిన ఐటీ సెక్టార్ ఉత్తమ ఫలితాలనిచ్చిందన్నారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగు సినిమాకు దేశంలో ఎంత ఆదాయం వస్తుందో.. ఓవర్సీస్ లోనూ అంతే ఆదాయం వస్తోందన్నారు. తెలుగు సినిమాకు దేశంలో ఎంత ఆదాయం వస్తోందో, ఓవర్సీస్‌లోనూ అంతే ఆదాయం వస్తోందని, దీనిని బట్టి మనవారు ఎంతగా విస్తరించారో అర్థం చేసుకోవచ్చన్నారు. అలాగే.. 2047 వరకు ఒక విజన్ సిద్ధం చేసుకోవాలని ఇటీవల జీ 20 చర్చల సందర్భంగా ప్రధానికి సూచించినట్టు చెప్పారు.
దేశంలో పెట్రోలు ధరలు, కరెంటు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదేనని, చెత్తకు కూడా పన్ను వసూలు చేస్తున్న రాష్ట్రం కూడా మనదేనని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. తమ బిడ్డల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట ప్రభుత్వ కుట్రేనని ఆరోపించారు. జగన్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదని, ఆయన తండ్రి వైఎస్సార్ తనకు స్నేహితుడని అన్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి, వైసీపీకి మధ్య కాదని.. 5 కోట్ల మంది ప్రజలకు, జగన్‌కు మధ్య జరుగుతాయని పేర్కొన్నారు.