ఐటీల్లో కొనసాగుతున్న లేఆఫ్ లు.. కాగ్నిజెంట్ లో 3500 మందికి ఉద్వాసన
తాజాగా ఆ లిస్టులోకి కాగ్నిజెంట్ కూడా చేరింది. 3,500 మంది ఉద్యోగులకు కాగ్నిజెంట్ సంస్థ ఉద్వాసన పలికేందుకు..
అంతర్జాతీయంగా ఐటీ, సాఫ్ట్ వేర్ సంస్థల్లో కోతలు కొనసాగుతున్నాయి. ట్విట్టర్, గూగుల్, మెటా, జొమాటో, యాక్సెంచర్ ఇలా అన్నింటిలోనూ ఉద్యోగుల లే ఆఫ్ లు కొనసాగుతున్నాయి. ఏ క్షణాన ఉద్యోగం ఊడిపోతుందోనని సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తాజాగా ఆ లిస్టులోకి కాగ్నిజెంట్ కూడా చేరింది. 3,500 మంది ఉద్యోగులకు కాగ్నిజెంట్ సంస్థ ఉద్వాసన పలికేందుకు రెడీ అయింది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా త్వరలోనే పెద్దసంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈఓ ఎస్ రవికుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా సంస్థకు చెందిన 11 మిలియన్ చదరపు అడుగుల స్థలాలను కూడా వదులుకోనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక త్రైమాసికంలో కాగ్నిజెంట్ 3 శాతం నికర లాభంలో వృద్ధిని నమోదు చేసింది. గతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఇది 11.2 శాతం అధికం. కానీ పూర్తి ఏడాదికి ఆదాయం తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్వాసనలకు సిద్ధమైంది. అంతేకాదు వ్యయాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా కొన్ని బ్రాంచ్ లను కూడా మూసివేయనున్నట్లు సీఈఓ రవికుమార్ తెలిపారు. ఈ లే ఆఫ్ లలో భారత్ కు చెందిన ఉద్యోగులు ఎంతమంది ఉంటారన్నది ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం కాగ్నిజెంట్ లో 3,51,500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో 2 లక్షల మంది ఉద్యోగులు భారత్ లోనే విధులు నిర్వర్తిస్తున్నారు.