పట్టు చిక్కిందా... ప్రామిస్ వచ్చిందా?

మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి యాక్టివ్ అయ్యారు. ఆయనకు హైకమాండ్ నుంచి ప్రామిస్ లభించినట్లుంది

Update: 2022-07-25 06:18 GMT

పొంగులేటి శ్రీనివాసరెడ్డి... ఆర్థికంగా బలమైన వ్యక్తి. వ్యాపార రంగంలో బాగానే సంపాదించారు. ఇటీవల ఆయన ఆఫీసులోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. పలు వ్యాపార సంస్థల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అయితే రాజకీయాల్లో గత మాత్రం గత నాలుగేళ్ల నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారంలో సక్సెస్ అయిన పొంగులేటి రాజకీయాల్లో మాత్రం ఒక్క ఛాన్స్ తోనే సరిపెట్టుకోవాలా? అన్న బాధ ఆయన అభిమానుల్లో కలుగుతుంది. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి గుర్తింపే ఉంది.

తొలి రెడ్డినేతగా....
2014లో వైసీపీ నుంచి ఖమ్మం పార్లమెంటు నుంచి విజయం సాధించారు. నిజానికి ఖమ్మం పార్లమెంటుకు కమ్మేతర సభ్యులు ఎన్నికయింది అతి తక్కువే అని చెప్పాలి. జలగం వెంగళరావు, పీవీ రంగయ్యనాయుడు వంటి వారు మినహాయించి ఇక్కడ దాదాపుగా గెలిచింది కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. నాదెండ్ల భాస్కరరావు, తమ్మినేని వీరభద్రం, రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావు వంటి వారు ఎన్నికయ్యారు. కానీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక్క రెడ్డి సామాజికవర్గం నేత కూడా ఎంపిక కాలేదు. దానిని 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రేక్ చేశారు.
పార్టీ మారాలనుకున్నా....
అయితే రాష్ట్ర విభజన జరగడంతో వైసీపీ ఇక్కడ పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో వన్ ఫైన్ మార్నింగ్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు. తనతో పాటు ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా వైసీపీలోకి తీసుకెళ్లారు. అయితే ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో గ్రూపు విభేదాల కారణంగా పొంగులేటి ఎలాంటి పదవులు పొందలేకపోయారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ టిక్కెట్ దక్కలేదు. అక్కడ మంత్రి పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు గ్రూపుల మధ్య తాను తట్టుకోలేనని భావించి ఒక దశలో ఆయన అసహనానికి గురై పార్టీని వీడేందుకు కూడా ప్రయ్నతించారంటారు.
కేటీఆర్ హామీతో....
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజ్యసభ స్థానం దక్కుతుందని భావించినా అది కూడా దక్కలేదు. దీంతో ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను స్వయంగా కలిసి సలహా కూడా తీసుకున్నారు. పొంగులేటి కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీలోకి వెళతారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ వాటన్నింటికీ పొంగులేటి చెక్ పెట్టారు. ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ ఆయన ఇంటికి లంచ్ కు వెళ్లారు. కేటీఆర్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి హామీయే లభించినట్లుంది. అందుకే మళ్లీ యాక్టివ్ అయ్యారు. కేటీఆర్ బర్త్‌డే రోజు కోటి రూపాయల విలువైన నిత్యావసరాలను వరద బాధితులకు పంచి పెట్టారు. తన కుమార్తె వివాహానికి కేసీఆర్ ను కూడా ఆహ్వానించారు. గ్యాప్ తగ్గింది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. పార్టీ హైకమాండ్ నుంచి ఆయనకు ప్రామిస్ లభించడంతోనే రాజకీయంగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడీ అవుతున్నారు.


Tags:    

Similar News