వంగవీటికి ఉమకు గ్యాప్ ఉందా?
సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ రాధాను పలకరించకపోవడం చర్చనీయాంశమైంది
వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగింది. తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు సయితం రాధా ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ధైర్యం చెప్పారు. పార్టీ తరుపున భరోసా ఇచ్చి వచ్చారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నాని సయితం రాధా వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించి వచ్చారు. కానీ కాపు సామాజికవర్గం నుంచి రాధాకు మద్దతు కరవయింది.
మౌనంగా ఉన్నది...
సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ రాధాను పలకరించకపోవడం చర్చనీయాంశమైంది. కాపు సామాజికవర్గానికి చెందిన బొండా ఉమ రాధా సంఘటనలో మౌనంగా ఉండటానికి కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతుంది. సెంట్రల్ నియోజకవర్గంలో కాపులు, బ్రాహ్మణులు బలంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లోనూ బొండా ఉమ స్వల్ప ఓట్ల మెజారిటీతోనే ఓటమి పాలయ్యారు. రాధా తనకు మద్దతు ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో ఉందని తెలిసింది.
థ్రెట్ ఉందనేనా?
దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి తనకు రాధా నుంచి థ్రెట్ ఉండే అవకాశాలున్నాయని కూడా బొండా ఉమ భావిస్తున్నారు. ఆయన విజయవాడలో లేకపోయినా, విదేశాల్లో ఉన్నా రాధా రెక్కీపై ఖచ్చితంగా స్పందించాల్సి ఉంది. ఎక్కడి నుంచైనా స్పందించవచ్చు. కనీసం రాధాకు ఫోన్ చేసి తన మద్దతు తెలిపే అవకాశముంది. కానీ బొండా ఉమ రాధా విషయంలో దూరంగా ఉండటానికి కారణాలేమిటన్న దానిపై చంద్రబాబు కూడా ఆరా తీసినట్లు తెలిసింది.
విజయవాడలో లేరంటూ....
బొండ ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు విజయవాడలో టీడీపీలో ఒక వర్గంగా కొనసాగుతున్నారు. కేశినేని నానికి వ్యతిరేక వర్గంగా ఉన్నారు. అయితే అందిన సమాచారం మేరకు బొండా ఉమ విజయవాడలో లేరు. అందుకే ఆయన స్పందించ లేదని ఉమ వర్గీయులు చెబుతున్నారు. ఈనెల 10వ తేదీ ఉమ విజయవాడ వస్తారని, అప్పుడు కలుస్తారని అంటున్నారు. కానీ రాధా రెక్కీ విషయాన్ని ఉమ సీరియస్ గా స్పందించక పోవడం వల్లనే ఫోన్ చేయకపోవడం, ట్వీట్ చేయకపోవడం చేయలేదన్నది సమాచారం. మొత్తం బొండా ఉమకు, రాధాకు గ్యాప్ ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.