వివిధ రంగాల్లో ప్రముఖుల చేతిలో ఎదుర్కొన్న వేదింపులను బహిర్గతం చేస్తున్న #మీటూ ఉద్యమం క్రికెట్ కు చేరింది. ఒకప్పుడు శ్రీలంక అగ్ర క్రికెటర్ గా, ఆ దేశానికి ప్రపంచ కప్ ను అందించిన కెప్టెన్, ప్రస్తుత శ్రీలంక పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ బాగోతాన్ని ఓ ఎయిర్ హోస్టెస్ బహిర్గతం చేశారు. ‘‘ముంబై మ్యాచ్ కోసం వచ్చిన శ్రీలంక జట్టు జుహు సెంటర్ ఎలివేటర్ హోటల్ లో దిగింది. నా స్నేహితురాలితో పాటు నేను కూడా వారి ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వెళ్లా. హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న అర్జున రణతుంగ నా వద్దకు వచ్చి గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి నుంచి విడిపించుకోవడానికి తన్నడం మొదలుపెట్టాను. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, పాస్ పోర్టు క్యాన్సిల్ చేయిస్తానని అరవడంతో వదిలిపెట్టాడు’’ అని సదరు ఎయిర్ హోస్టెస్ అర్జున రణతుంగ బాగోతాన్ని #మీటూ పేరుతో బయటపెట్టారు.