రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే గజ్వెల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన భార్య నిర్మల, కుమారుడు సూర్యకిరణ్ తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ... ప్యూడలిజానికి వ్యతిరేకంగానే తన పోరాటం ఉంటుందన్నారు. తెలంగాణలో రాజ్యాంగం పోయి నయా ఫ్యూడలిజం వచ్చిందని ఆయన ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననడంతో సహా కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో చేరనని, త్వరలోనే అన్ని సెక్యూలర్ పార్టీల నేతలను కలుస్తానన్నారు. ఢిల్లీలో సెక్యూలర్ శక్తుల చేతిలో అధికారం ఉంటే ప్రజల హక్కులు కాపాడవచ్చని పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రజాస్వామిక హక్కులను పరిరక్షిస్తామని రాహుల్ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. బిడ్డలను పోగొట్టుకుంటున్న తల్లుల గోస గుర్తించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని చూడాలని గద్దర్ భార్య విమల.. రాహుల్ గాంధీని కోరారు. దీంతో ఇవాళ సాయంత్రం గద్దర్ కుటుంబం సోనియా గాంధీని కలవనుంది.