అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ ల హత్యలకు సంబంధించి మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. అయితే ఈ లేఖలో సంచలన విషయాలను మావోయిస్టులు ప్రస్తావించారు. వైసీపీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి మారిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికారం కోసం 20 కోట్లకు అమ్ముడుపోయారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. గిడ్డి ఈశ్వరి పద్థతి మార్చుకోకుంటే కిడారి సర్వేశ్వరరావు, సోమలకు పట్టిన గతే పడుతుందని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.
తవ్వకాలకు అనుకూలంగా.......
కిడారి సర్వేశ్వరరావు, సోమలు గిరిజన ద్రోహానికి పాల్పడుతున్నందునే ప్రజాకోర్టులో శిక్ష విధించామని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వీరు మారారని, గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు తాము హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులకు తమకు ఎలాంటి శతృత్వం లేదని, అందుకే వారు ఆయుధాలతో దొరికినా పోలీసులకు ఎటువంటి హాని చేయలేదని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు ఎవరు అనుకూలంగా ఉన్నా వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని పేర్కొన్నారు. ఈ లేఖ మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో విడుదల అయింది.