వారి బౌలింగ్ చూస్తే వెన్నులోంచి వణుకు పుట్టేది. బ్యాటింగ్ లైనప్ అరివీర భయంకరులతో నిండివుండేది. ఫీల్డింగ్ సైతం గోడను పోలి ఉండేది. ఇప్పుడు అది గతంగా మారిపోయింది. ఆ టీం నే వెస్టిండీస్. ఇప్పుడు చిన్న చిన్న జట్లు సైతం పులిలా విజృంభిస్తుంటే ఒకప్పటి ప్రపంచ మేటి టీం అందరి చేతిలో చతికిల పడిపోతుంది. అది కూడా అత్యంత దారుణంగా అన్నది తాజా ఇండియా వెర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ చాటి చెబుతుంది.
రాను రాను ...
ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చెందడం అంటే అత్యంత చెత్తగా ఆడటమే అంటారు క్రికెట్ పండితులు. చాలా కాలంగా ఒకప్పటి అత్యుత్తమ వెస్టిండీస్ తరచూ ఇలాగే ఓడిపోతుంది. పోరాడి ఉండటం మాట అటుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ టీం చూపే ఆటను కూడా వారు చూపలేకపోతున్నారు. క్లైవ్ లాయిడ్, విప్ రిచర్డ్స్, బ్రెయిన్ లారా, మాల్కం మార్షల్, అంబ్రోస్, రిచీ రీచర్డ్సన్, గ్రీన్డ్జ్ ఈ పేర్లు ఒకనాటి వెస్టిండీస్ టీం కి వన్నెతెచ్చిన అత్యుత్తమ ఆటగాళ్లలో కొందరు మాత్రమే. వీరికి ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు వున్నారు. మరి నేటి టీం లో చందర్ పాల్, గెయిల్, పోలార్డ్ వంటివారు తప్ప పెద్దగా గుర్తు పెట్టుకునేంత ఫెరఫార్మెన్స్ ప్రదర్శించేవారు కరువయ్యారు.
వివాదాల సుడిలో బోర్డు ...
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు , ఆటగాళ్ల నడుమ తరచూ వేతనాల అంశంలో వివాదాల కారణంగా మంచి టీం దూరం అవుతూ వచ్చింది. క్రికెట్ అంటే పడిచచ్చే కరేబియన్ దీవుల్లో ఇప్పుడు కాగడా పెట్టి ఉత్తమ క్రీడాకారుల కోసం వేటాడాలిసి వస్తుంది. దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు లా వెస్టిండీస్ టీం తయారయ్యింది. ఇలాగే విండీస్ ఆట కొనసాగితే టెస్ట్ క్రికెట్ హోదా సైతం ఆ టీం కోల్పోయే ప్రమాదం ఉందని క్రీడా విశ్లేషకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వెస్టిండీస్ టీం గత వైభవాన్ని ఎప్పుడు సంతరించుకుంటుందా అని క్రీడాభిమానుల ఎదురుచూపులు ఎప్పుడు ఫలిస్తాయో చూడాలి.