తెలంగాణ కు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక ఇప్పుడు అన్ని పార్టీల లక్ష్యం ఒక్కటే. వున్న 60 రోజుల్లో 100 సీట్లు సాధించాలి. తెలంగాణాలో 119 అసెంబ్లీ సీట్లు వున్నాయి. ఇందులో 60 సాధిస్తే మెజారిటీ తెచ్చుకుని ప్రభుత్వం నెలకొల్పవచ్చు. అయితే స్ట్రాంగ్ సర్కార్ కావాలంటే 100 సీట్లు అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. ఆ దిశగా ఇప్పుడు గులాబీ దళం, మహా కూటమి చక చకా అడుగులు వేస్తున్నాయి. ఇక బిజెపి, కమ్యూనిస్ట్ లు వంటివారు గతంలో వచ్చిన స్థానాలకు తగ్గకుండా ఉంటే చాలన్న లెక్కల్లో వున్నారు.
దూసుకుపోతున్న కారు ...
సర్కార్ ను అనూహ్యంగా రద్దు చేయడమే కాదు 105 మంది అభ్యర్థులను ముందే ప్రకటించి నెలరోజులుగా ప్రచారంలో దూసుకుపోతుంది కారు పార్టీ. కారు స్పీడ్ ని ప్రస్తుతం ప్రత్యర్ధులు అందుకోలేనంత దూరంలో వున్నారు ప్రచారంలో. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, టిజెఎస్ వంటివి జత కట్టడానికే నెలరోజుల సమయం పట్టింది. ఇక సీట్ల అంశం ఇప్పుడు ఆ నాలుగు పార్టీలకు సమస్యగా ఎదురు నిలవనుంది. అదొక్కటి సర్దుబాటు అయితే టికెట్ల ప్రకటన ఆయా పార్టీలకు మరో తలనొప్పి అంశం. అది కూడా పూర్తి కావడానికి చాలా సమయం పట్టేలా వుంది.
కాంగ్రెస్ జాబితా......
అయితే ఈ నెల 20 వ తేదికి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసేలా కసరత్తులు చేస్తుంది. అది పూర్తి కావాలంటే మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఎవరు ఎక్కడ పోటీ అన్నది స్పష్టం కావాలిసి వుంది. ఈ తంతంగం పూర్తి కావడానికి మరో నెల పూర్తిగా పట్టేలా వుంది. అయితే ఇప్పటికే గులాబీ పార్టీ జోష్ మీద వున్న నేపథ్యంలో మహాకూటమి ముందుగా ఈ సమస్య తేల్చి సాగిపోవాలని డిసైడ్ అవుతుంది. మరి కారు స్పీడ్ కి కూటమి బ్రేక్ లు వేయాలంటే పరుగెత్తక తప్పదు. ఈ నేపథ్యంలో వీరి వ్యూహాల్లో ఎవరిది పై చెయ్యి అవుతుందో వేచి చూడాలి.