మూడేళ్లవుతున్నా... మూడ్ మారలేదా?
జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతుంది. మూడేళ్లు పాలనపైనే జగన్ దృష్టి పెట్టారు.
జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతుంది. మూడేళ్లు పాలనపైనే జగన్ దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంపైనే జగన్ ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేశారు. తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలు, మ్యానిఫేస్టోలో పెట్టిన అంశాలు అమలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో తప్పులేదు. ఇప్పటికే 90 శాతం హామీలను నెరవేర్చానని చెప్పుకునే వీలు జగన్ కు కలిగింది. ఏదో పథకం ద్వారా లబ్దిదారులకు నగదును అందచేస్తూనే ఉన్నారు.
పార్టీని పూర్తిగా....
కానీ మూడేళ్ల నుంచి పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. జిల్లాల్లో అసలు కార్యవర్గం ఉందా? అన్న సందేహం కలుగుతుంది. పార్టీ కార్యవర్గాన్ని మూడేళ్లవుతున్నా ఇంతవరకూ ప్రక్షాళన చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు ఏ కార్యవర్గం ఉందో అదే నేటికీ కంటిన్యూ అవుతుంది. పోనీ పార్టీ నేతలు జగన్ జిల్లాల పర్యటనకు వస్తే తప్పించి ఎక్కడా వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు.
ఆ తీరికే లేదా?
మూడేళ్ల నుంచి కనీసం పార్టీని పట్టించుకునేంత సమయం లేదా? అన్న ప్రశ్న ఆ పార్టీ నేతల నుంచే వినపడుతుంది. పోనీ నియోజకవర్గాలు, జిల్లాల్లో పార్టీ నేతలు ఐక్యతగా ముందుకు సాగుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. దాదాపు వంద నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ప్రభుత్వ పదవులు కొందరికి లభించడం, మరికొందరికి దక్కకపోవడంతో సహజంగా అసంతృప్తి తలెత్తుతోంది. మూడేళ్ల నుంచి ప్లీనరీని కూడా వైసీపీ నిర్వహించడం లేదు. దీంతో జగన్ పార్టీ క్యాడర్ కు మూడేళ్ల నుంచి కన్పించడం లేదు.
కొత్త జిల్లాలు ఏర్పడినా...?
ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి. ఈ జిల్లాలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా నియమించాల్సి ఉంది. ఇదేమీ పట్టనట్లువ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్షలు చేసుకుంటున్నారు. కనీసం పార్టీ పరిస్థితిపై ఒక్కసారి సమీక్ష చేసి ఉంటే బాగుండేదని పలువురు సీనియర్ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సయితం పార్టీపై దృష్టి పెట్టిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీని, క్యాడర్ ను జగన్ పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో లెక్కలు మారతాయన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.