సినీ ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దల నుంచి ప్రతిపక్ష నేత జగన్‌కు మద్దతు లభిస్తోంది. అందులోనూ మంచు ఫ్యామిలీ అండగా నిలబడుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డికి బంధువు, సినీనటుడు మోహన్‌బాబు.. త్వరలోనే రాజకీయాల్లోకి మళ్లీ ప్రవేశిస్తానని ప్రకటించడంతో ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారోననే సందేహం అందరిలోనూ ఉంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా వ్యవహరించినా.. తర్వాత ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు.
చంద్రబాబుతో విభేదాలు...
చంద్రబాబుతో రాజకీయంగా ఆయనకు గ్యాప్ వచ్చాక ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇక కొద్ది రోజులుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై మోహన్‌బాబు కూడా స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీ బరిలోకి దిగుతున్నానని..అయితే ఏ పార్టీ నుంచి తాను పోటీ చేస్తాననేది త్ రలోనే ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు.
ఇక లాంఛనమేనా...?
మోహన్‌బాబుకు చంద్రబాబుతో తీవ్రంగా విబేధాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఫ్యామిలీతో ఆయనకు బలమైన బంధుత్వం ఉంది. జగన్ మోహన్‌బాబుకు అల్లుడు అవ్వడంతో పాటు ఇటు జగన్ చిన్నాన్న కుమార్తెనే మోహన్‌బాబు కుమారుడు విష్ణు భార్య కావడంతో మంచు ఫ్యామిలీ వైసీపీకి బాగా దగ్గర అవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన వైసీపీ నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జోరందు కుంది. త్వరలోనే ఆయన వైసీపీలోకి వెళ్లిపోవడం ఖాయమని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.
శ్రీకాళహస్తి బరిలో...
ఇక ఇదే సమయంలో మోహన్‌బాబు తనయుడు విష్ణు.. జగన్ పాదయాత్రపై చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. దీంతో ఏ పార్టీలో చేరతారనే విషయం మోహన్‌బాబు చెప్పకపోయినా.. అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు వివరిస్తున్నారు. గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాంలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. అనంతరం సినిమాలకే పరిమితమయ్యారు. చాలా ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. కొద్ది కాలం నుంచి సునిశిత విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో మళ్లీ రాజకీయ అరంగేట్రంపై గుసగుసలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రత్యేకహోదా విషయంలోనూ టీడీపీ వైఖరిపై ఆయన.. విమర్శలు గుప్పించారు. వైఎస్ మరణంతో జగన్‌కు కొంత దూరంగా ఉంటూ వస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ..జగన్‌కు సాంత్వన చేకూరుస్తున్నారు. ఆయన వైసీపీ తరఫున శ్రీకాళహస్తి నుంచి బరిలోకి దిగుతారని అంతా భావిస్తున్నారు.
ప్రచారానికి రెడీనా...
ఇక మోహన్‌బాబు కుమారుడు.. విష్ణు తణుకులో ప్రజా సంకల్పయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జగన్ చేపట్టిన యాత్రకు అపూర్వ స్పందన వస్తోందంటూనే 2019లో ఆయనే సీఎం అవుతారంటూ జోస్యం చెప్పాడు. దీంతో మంచు ఫ్యామిలీ వైసీపీకి అండగా నిలబడుతోందనే చర్చ మొదలైంది. ఇక మోహన్‌బాబు కూడా వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మోహన్ బాబు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ సామాజిక వర్గం మద్దతు లభిస్తుందని వైసీపీ నాయకులు.. అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోహన్‌బాబు వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం ఒక ఎత్తు అయితే ఆయన ఫ్యామిలీలో ఆయన తనయులు విష్ణుతో పాటు మనోజ్ కూడా వైసీపీకి ప్రచారం చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.