అమావాస్య అచ్చివచ్చేనా ...?

Update: 2018-10-07 02:30 GMT

ఆరు నెంబర్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ప్రస్తుత తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కి బాగా ఆచోచ్చే సంఖ్య గా చెబుతారు. అందుకే ఆయన గత నెల ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేసి ఆరు సంఖ్య వచ్చేలా 105 మంది అభ్యర్థులతో ప్రచారం షురూ చేశారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సరిగ్గా నెల తరువాత ఆరో తేదీనే కాకతాళీయంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అయితే పోలింగ్ తేదీ డిసెంబర్ 7 కౌంటింగ్ డిసెంబర్ 11 కావడంతో ఈ ఫలితం గులాబీ పార్టీకి జ్యోతిష్యం ప్రకారం ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

అమావాస్య పోలింగ్ ... చవితి నాడు కౌంటింగ్ మరి ...

జ్యోతిష్యాన్ని బాగా అనుసరించే గులాబీ బాస్ కి ఇప్పుడు షెడ్యూల్ లో ప్రకటించిన తేదీల తిధులు ఎలా ఉంటాయా అన్న ఆసక్తి అందరిలో మొదలైంది. డిసెంబర్ 7 అమావాస్య రావడం, డిసెంబర్ 11 చవితి నాడు ఫలితాలు విడుదల రావడం కెసిఆర్ జాతక రీత్యా ఎలా ఉంటాయన్న లెక్కల్లో జ్యోతిష్య పండితులు లెక్కలు మొదలు పెట్టారు. తెలుగు వారి సంప్రదాయాల రీత్యా అమావాస్య నాడు శుభం గా భావించరు. అదే తమిళులు అమావాస్య మహా పర్వదినంగా భావిస్తారు. తమిళ చిత్రాలను అమావాస్య చూసుకుని మరీ విడుదల చేస్తారంటే వారికి ఆ రోజు ఎంత సెంటిమెంటో తెలుస్తుంది. అయితే కెసిఆర్ పండితులు మాత్రం ఎన్నికలు అమావాస్య రావడం శుభకరమంటున్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య శుక్రవారమని శత సహస్ర చండీ యాగ ఉపాసకుడైన కెసిఆర్ కు అమ్మ అనుగ్రహం ఉంటుందన్న వాదన తెస్తున్నారు.

కెసిఆర్ పని అయిపోయిందంటున్న కాంగ్రెస్ ...

కెసిఆర్ జ్యోతిష్య లెక్కలన్నీ తప్పాయని అంటుంది కాంగ్రెస్ పార్టీ. నవంబర్ మాసం చివరి లోగా ఎన్నికలు జరిగితే కెసిఆర్ సీఎం అయ్యి తీరుతారని ఆయన జ్యోతిష్కులు చెప్పారని కానీ డిసెంబర్ లో ఎన్నికలు రావడంతో ఆయన ఆశలు తలక్రిందులు అవుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యష్కీ వంటివారు వ్యాఖ్యానించడం మరో కొత్త చర్చకు తెరలేపింది. అయితే గులాబీ బాస్ ఇంకా ప్రకటించాలిసిన 14 అసెంబ్లీ స్థానాలను అమావాస్య వెళ్ళాక ప్రకటించడానికి సిద్ధం అవడాన్ని గమనిస్తే ఆయనకు ఆ రోజు అంటే భయమని సంకేతాలు ఉన్నట్లు మరికొందరు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. మొత్తానికి గులాబీ బాస్ కి షెడ్యూల్ ,ఎన్నికల తేదీలు, ఫలితాల తేదీ ఎంతవరకు కలిసొచ్చిందో డిసెంబర్ 11 తేల్చి చెప్పనుంది.

Similar News